Federal Bank : నవ్వుతో చెల్లింపు!
ABN , Publish Date - Aug 31 , 2024 | 04:04 AM
మారుతున్న కాలానికి అనుగుణంగా సులభంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందుకు కొంగొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి.
‘స్మైల్‌పే’ పేరిట ముఖ గుర్తింపు ఆధారిత చెల్లింపు వ్యవస్థ
ప్రారంభించిన ఫెడరల్ బ్యాంకు
దేశంలో తొలి ఫేషియల్ పేమెంట్ వ్యవస్థ
న్యూఢిల్లీ, ఆగస్టు 30: మారుతున్న కాలానికి అనుగుణంగా సులభంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందుకు కొంగొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. నగదు నుంచి కార్డులు తర్వాత క్యూఆర్ కోడ్‌లు, వేరబుల్స్‌తో వివిధ రకాల చెల్లింపులు చేస్తున్నాం.
తాజాగా ముఖ గుర్తింపు టెక్నాలజీ ఆధారంగా చెల్లింపులు జరిపే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఫెడరల్ బ్యాంకు ‘స్మైల్‌పే’ పేరిట ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ తరహా చెల్లింపు విధానాన్ని ప్రారంభించడం దేశంలోనే మొదటిది.
రిలయన్స్ రిటైల్, స్వతంత్ర మైక్రో హౌసింగ్‌ల సహకారంతో ఎంపిక చేసిన శాఖలు, ఔట్‌లెట్లలో పైలెట్‌గా దీన్ని ప్రారంభించింది. యూఐడీఏఐకి చెందిన భీమ్ ఆధార్ పేపై అత్యాధునిక ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీతో దీనిని రూపొందించారు. ఈ వినూత్న సదుపాయం వల్ల నగదు, కార్డులు, మొబైల్ డివైజ్‌ల అవసరం లేకుండా ఒక్క నవ్వుతో చెల్లింపులు చేయవచ్చు. తొలుత స్మైల్ పే సర్వీసు కేవలం ఫెడరల్ బ్యాంకు కస్టమర్లకే అందుబాటులో ఉంటుంది.
వ్యాపారులు, కస్టమర్లు ఇద్దరు కూడా ఫెడరల్ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండాలి. రానున్న కాలంలో ఈ సేవలను విస్తృతం చేయనున్నారు. స్మైల్‌పే ద్వారా ఒక్కో లావాదేవీకి రూ.5వేల వరకు పరిమితి ఉంటుంది. నెలకు రూ.50 వేల వరకు చెల్లింపులు చేయవచ్చు. బ్యాంకు మర్చంట్స్ తమ మొబైల్‌లో ఫెడ్ మర్చంట్ అప్లికేషన్‌లో పేమెంట్ అప్షన్లలో ఉండే స్మైల్ పే ఆప్షన్ ఎంచుకొని ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
ఫెడ్ మర్చంట్స్.. కస్టమర్ ఆధార్ నంబరును ఎంటర్ చే సి చెల్లింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. అనంతరం వ్యాపారి మొబైల్ నుంచి కస్టమర్ ముఖాన్ని స్కాన్ చేస్తారు. యూఐడీఏఐ వ్యవస్థలో నిల్వ ఉన్న ఫేషియల్ డేటా ఆధారంగా వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత కస్టమర్ ఖాతా నుంచి సొమ్ము డెబిట్ అవుతుంది. ఆ మొత్తం వ్యాపారి ఫెడరల్ బ్యాంకు ఖాతాలో జమవుతుంది.