Manish Sisodia: భార్యతో సెల్ఫీ తీసుకుని.. తనదైన శైలిలో స్పందించిన మనీశ్
ABN , Publish Date - Aug 10 , 2024 | 09:51 AM
దేశంలోని ప్రతి వ్యక్తిని స్వేచ్చగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. దాంతో 17 నెలల తర్వాత... ఈ రోజు ఉదయం ఇలా స్వేచ్చగా టీ తాగుతున్నాను. ప్రతి ఒక్కరితో కలిసి బహిరంగ ప్రదేశంలో ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛను మాకు దేవుడు కల్పించాడని.. మనీశ్ సిసోడియా తన ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 10: మద్యం కుంభకోణం కేసులో దాదాపు 17 నెలల అనంతరం తీహాడ్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా శనివారం ఉదయం తనదైన శైలిలో స్పందించారు. తన భార్యతో కలిసి టీ తాగుతూ.. సెల్ఫీ తీసుకుని దానిని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దేశంలోని ప్రతి వ్యక్తిని స్వేచ్చగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. దాంతో 17 నెలల తర్వాత... ఈ రోజు ఉదయం ఇలా స్వేచ్చగా టీ తాగుతున్నాను. ప్రతి ఒక్కరితో కలిసి బహిరంగ ప్రదేశంలో ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛను మాకు దేవుడు కల్పించాడని.. మనీశ్ సిసోడియా తన ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
Also Read: Wayanad: ప్రముఖ నటుడు మోహన్ లాల్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యూట్యూబర్ అరెస్ట్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు శుక్రవారం జస్టిస్ ఏ.ఆర్. గవాయి, కె. వి. విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
అనంతరం తీహాడ్ జైలు నుంచి మనీశ్ సిసోడియా విడుదలయ్యారు. ఆ తర్వాత ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. ఆయన తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడంపై అరవింద్ కేజ్రీవాల్ భార్య స్పందించారు. న్యాయం జరగడం కాస్తా ఆలస్యం అవుతుందేమో కానీ.. న్యాయం తిరస్కారానికి గురి కాదన్నారు.
Also Read: wayanad landslides: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
ఇక మనీశ్ సిసోడియా విడుదల కావడంతో.. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్బంగా ఆప్ అగ్రనేతలు అతిషి, సంజయ్ సింగ్, రాఘవ చద్దా తదితరులు స్పందించారు. అయితే వీరి స్పందనపై బీజేపీ ఢిల్లీ చీఫ్ ఘాటుగా స్పందించారు. మనీశ్ సిసోడియా కేవలం బెయిల్‌పై మాత్రమే విడులయ్యారన్నారు. అంతేకానీ.. ఆయనపై కేసులు మాత్రం అలాగే ఉన్నాయని ఆప్ నేతలకు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఢిల్లీ చీఫ్ డిమాండ్ చేశారు.
మద్యం కుంభకోణం కేసులో 2023, ఫిబ్రవరి 26వ తేదీన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం ఇదే కేసులో ఈడీ సైతం ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఆ క్రమంలో అదే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి మనీశ్ సిసోడియా రాజీనామా చేశారు.
నాటి నుంచి తీహాడ్ జైల్లోనే ఉన్న మనీశ్ పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించి.. చివరకు భంగపడ్డారు. దాదాపు 17 నెలల అనంతరం సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మాత్రం దక్కక పోవడం గమనార్హం.
Read More National News and Latest Telugu News