Chandipura Virus: భయపెడుతున్న మరో ప్రాణాంతక వైరస్.. నలుగురు చిన్నారులు మృతి
ABN , Publish Date - Jul 13 , 2024 | 05:56 PM
కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. రకరకాల వేరియెంట్‌లతో తన పంజా విసురుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో మరిన్ని ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ..
కరోనా వైరస్ (Corona Virus) ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. రకరకాల వేరియెంట్‌లతో తన పంజా విసురుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో మరిన్ని ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ.. అల్లకల్లోల వాతావరణం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా చాందిపుర (Chandipura Virus) అనే వైరస్ గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే దీని బారిన పడి నలుగురు పిల్లలు మృతి చెందారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. దీంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇటీవల గుజరాత్‌లోని సబర్‌కాంతా జిల్లాలో నలుగురు పిల్లలు జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. అయితే.. కొన్ని రోజుల్లోనే వాళ్లు చనిపోయారు. జులై 10వ తేదీన వాళ్లు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో.. వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చాందిపుర వైరస్ వల్లే వీళ్లు మృతి చెంది ఉంటారని హిమ్మత్‌నగర్ ఆసుపత్రి పీడియాట్రిక్ వైద్యులు భావిస్తున్నారు. మరో ఇద్దరు చిన్నారుల్లోనూ అవే లక్షణాలు కనిపించడంతో.. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మొత్తం ఆరుగురు పిల్లల రక్త నమూనాలను సేకరించి.. పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపారు. వాటి ఫలితాల కోసం వేచి చూస్తున్నామని సబర్‌కాంత జిల్లా ఆరోగ్యవాఖ అధికారి రాజ్ సుతారియా (Raj Sutaria) వెల్లడించారు.
కాగా.. ఈ చాందిపుర వైరస్ మెదడువాపుకు కారణమవుతుంది. ఇది సోకిన కొన్ని రోజుల్లోనే రోగి మరణిస్తాడు. ఇది దోమలు, పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా నలుగురు పిల్లలు రోజుల వ్యవధిలోనే మృతి చెందడంలో.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. ప్రభావిత ప్రాంతాల్లో పురుగులను చంపేస్తున్నారు. ప్రజలు సైతం అలర్ట్‌గా ఉండాలని, అసురక్షిత ప్రాంతాల్లో ఎక్కువగా సంచరించొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎవరిలోనైనా జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read Latest National News and Telugu News