Share News

Gali Janardhan Reddy: బళ్లారిలో ‘గాలి’ ఎటు వీస్తుందో.. కేఆర్‌పీపీ రాజకీయ గమ్యంపై చర్చలు

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:28 PM

కల్యాణ ప్రగతి పక్ష పార్టీ (కేఆర్‌పీపీ) అధ్యక్షుడు గాలి జనార్దన్‌ రెడ్డి(Gali Janardhan Reddy) గురువారం రాత్రి బీజేపీ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా(Amit Shah)తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

Gali Janardhan Reddy: బళ్లారిలో ‘గాలి’ ఎటు వీస్తుందో.. కేఆర్‌పీపీ రాజకీయ గమ్యంపై చర్చలు

- అమిత్‌షాను కలిసిన జనార్దన్‌ రెడ్డి

బళ్లారి(బెంగళూరు): కల్యాణ ప్రగతి పక్ష పార్టీ (కేఆర్‌పీపీ) అధ్యక్షుడు గాలి జనార్దన్‌ రెడ్డి(Gali Janardhan Reddy) గురువారం రాత్రి బీజేపీ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా(Amit Shah)తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడుతున్న సమయంలో ఈ ఇద్దరి కలయిక వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ నుంచి గాలి జనార్దన్‌రెడ్డి బయటకు వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్తగా పార్టీని స్థాపించారు. తనను బీజేపీ(BJP) అధిష్టానం పట్టించుకోవడం లేదని తాను బళ్లారికి రావడానికి అనుమతులు ఇవ్వకుండా బీజేపీ పెద్దలే అడ్డు తగులుతున్నారని అప్పట్లో గాలి జనార్దన్‌రెడ్డి బహిరంగంగానే విమర్శించారు. ఇక్కడ ఉండే తన స్నేహితులు కూడా తనకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఆయన అనేక సమావేశాల్లో బహిరంగంగానే విమర్శించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గాలి జనార్దన్‌రెడ్డి అమిత్‌ షాతో గురువారం రాత్రి సుమారు గంట పాటు చర్చలు సాగించారు. కేఆర్‌పీపీ పార్టీని బీజేపీలో కలిపేయాలని అమిత్‌ షా సూచించారని తెలుస్తోంది.

pandu1.jpg

ఇందుకు గాలి జనార్దన్‌రెడ్డి కూడా కొంత అయిష్టత వ్యక్తం చేశారని సమాచారం. ఎంపీ అభ్యర్థుల ప్రకటన తరువాత తనను కలిసేందుకు అవకాశం ఇవ్వడం, అంతే కాకుండా కొప్పళ, రాయచూరు, బళ్లారి(Koppala, Raichur, Bellary) జిల్లాల్లో ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన జరిగిన నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం కాక జనార్దన్‌రెడ్డి ఏ విషయం ఖచ్చితంగా తెలపలేక పోయారని సమాచారం. వాస్తవానికి రాయచూరు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంలో తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులను రంగంలోకి దింపాలని జనార్దన్‌రెడ్డి భావించారు. కొప్పళ జనరల్‌ ఎంపీ స్థానం నుంచి తన భార్య లక్ష్మిఅరుణ పోటీ చేయడానికి బీజేపీ సానుకూలత వ్యక్తం చేస్తుందని భావించారు. కానీ ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పుడు ఏమిచేయాలో తెలియక గాలి కొంత మౌనంగానే ఉండిపోయారని సమాచారం. అయితే ఆయన కేఆర్‌పీపీ(KRPP) నుంచి పోటీకి అభ్యర్థులను నిలుపుతారా..? లేదా బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తారా..?లేక కాంగ్రెస్ తో చేతులు కలుపుతారా..?అనే విషయంలో ఇంకా స్పష్టత వ్యక్తం చేయలేదు. కాకపోతే ఆయన వర్గీయుల్లో కొందరు బీజేపీలో చేరదామంటుంటే, మరి కొందరు కాంగ్రెస్‌ బెస్టు కదా అని అంటున్నారు. మరి కొందరు రెండూ వద్దని, ఇలాగే ప్రత్యేకంగా మనపార్టీలోనే ఉంటూ పోటీ చేస్తే సరిపోతుందని సలహాలు ఇస్తున్నారు. చివరకు ‘గాలి’ ఎటు వీస్తుందో వేచిచూడాల్సిందే.

Updated Date - Mar 16 , 2024 | 12:28 PM