Share News

1-19 మధ్య ఎయిరిండియా విమానం ఎక్కొద్దు!

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:24 AM

ఖలిస్థాన్‌ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ భారత్‌కు తాజాగా మరో హెచ్చరిక చేశాడు.

1-19 మధ్య ఎయిరిండియా విమానం ఎక్కొద్దు!

  • దాడి చేస్తామని ఉగ్రవాది పన్నూన్‌ హెచ్చరిక

  • కెనడా దృష్టిలో ఇది వాక్‌స్వాతంత్య్రం: జైశంకర్‌

  • ఎయిరిండియా విమానం ఎక్కొద్దు

  • 1-19 మధ్య ప్రయాణించొద్దు

  • దాడి చేస్తామని ఉగ్రవాది పన్నూన్‌ వార్నింగ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 21: ఖలిస్థాన్‌ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ భారత్‌కు తాజాగా మరో హెచ్చరిక చేశాడు. నవంబరు 1 నుంచి 19 మధ్య ఎయిరిండియా విమానాలపై దాడిచేస్తామని ప్రకటించాడు. సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఆ తేదీల నడుమ ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని సోమవారం ఓ వీడియోలో హెచ్చరించాడు. ‘సిక్కుల మారణహోమం’ 40వ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏదో ఒక ఎయిరిండియా విమానంపై దాడిచేసే అవకాశం ఉందని తెలిపాడు. అమెరికా, కెనడాల ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్న పన్నూన్‌ గత ఏడాది కూడా ఇలాంటి హెచ్చరికే చేశాడు. ఇందుకుగాను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అతడిపై నేరపూరిత కుట్ర, వివిధ వర్గాల నడుమ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడన్న ఆరోపణలతో కేసు నమోదు చేసింది. నిరుడు డిసెంబరు 13లోపు భారత పార్లమెంటుపై దాడిచేస్తానని కూడా ప్రకటించాడు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆ రాష్ట్ర డీజీపీ గౌరవ్‌ యాదవ్‌లను చంపుతామనీ బెదిరించాడు.

గ్యాంగ్‌స్టర్లు అంతా ఏకమై జనవరి 26న మాన్‌పై దాడిచేయాలని పిలుపిచ్చాడు. ఓపక్క భారత్‌లో పలు విమానాలకు బాంబు బెదిరింపులు(ఎక్కువ నకిలీవే) వస్తుండడం, మరో ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీ్‌పసింగ్‌ నిజ్జర్‌ హత్య దరిమిలా కెనడాతో భారత్‌ దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో పన్నూన్‌ తాజా వార్నింగ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న ఇతడిని కేంద్ర హోం శాఖ 2020 జూలైలో ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతకు ఏడాది ముందే ఎస్‌ఎ్‌ఫజేను చట్టవిరుద్ధ సంస్థగా పేర్కొంటూ నిషేధం విధించింది. పన్నూన్‌ హత్య కు భారత గూఢచార సంస్థ రా మాజీ అధికారి వికాస్‌ యాదవ్‌ కుట్ర పన్నినట్లు అమెరికా ఈ నెల 17న ఆరోపించడం.. ఇది నిరాధార ఆరోపణగా భారత్‌ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.


  • గతంలోనూ బెదిరించారు: విదేశాంగ మంత్రి

ఎయిరిండియాకు, దాని ప్రయాణికులకు సోమవారం వచ్చిన హెచ్చరిక గురించి భారత ప్రభుత్వానికి తెలియదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. అయితే గతంలో కూడా భారత ఎయిర్‌లైన్స్‌కు, పార్లమెంటుకు, మన దౌత్యవేత్తలకు, హైకమిషన్లకు, మన నేతలకు బెదిరింపులు రావడం చూశామని.. ఇది ఆందోళనకరమని ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా కెనడా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘చాలా తెలివైన పదాలతో ఈ బెదిరింపులు చేశారు. కెనడా ప్రభుత్వానికి మాత్రం ఇది వాక్‌స్వాతంత్య్రం’ అని అన్నారు. నిలదీశారు. భారతీయ దౌత్యవేత్తల విషయంలో కెనడా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. భారత్‌లో తమకు లైసెన్సు లభించినట్లుగా ఆ దేశ రాయబారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Updated Date - Oct 22 , 2024 | 03:25 AM