Delhi : మంత్రులు రెండు నెలలు జీతాలు తీసుకోరు
ABN , Publish Date - Aug 30 , 2024 | 04:36 AM
హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలు తీసుకుంటోంది.
ఎమ్మెల్యేలూ ఇదే పని చేయాలి
అసెంబ్లీలో హిమాచల్ సీఎం వినతి
బీజేపీ వాకౌట్..ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం
సిమ్లా, ఆగస్టు 29: హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా అందరు మంత్రులు, చీఫ్ పార్లమెంటరీ సెక్రటరీలు, కేబినెట్ ర్యాంక్ హోదా ఉన్న నాయకులను రెండు నెలల పాటు జీతాలు, టీఏ, డీఏ వంటి భత్యాలు తీసుకోరని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుక్కు తెలిపారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే వరకు రెండు నెలల పాటు జీతాలు, భత్యాలు తీసుకోకూడదని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్టు వెల్లడించారు.
ఇది చిన్నమొత్తమే కావచ్చని, కానీ ఒక మంచి సందేశాన్ని పంపించేదని చెప్పారు. ఎమ్మెల్యేలు కూడా ఈ మార్గాన్ని అనుసరించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన అనంతరం మాజీ సీఎం జైరాం ఠాకూర్ ఆధ్వర్యంలో బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున జీతాలు తీసుకోవడాన్ని వారు వాయిదా వేశారు. రాజ్యాంగం అనుమతించకపోయినా చీఫ్ పార్లమెంటరీ కార్యదర్శులను నియమించారు. చాలా మందికి కేబినెట్ హోదా, చైర్మన్ హోదా ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పుడేమో జీతాలు తీసుకోవద్దని ఎమ్మెల్యేలను అడుగుతున్నారు. సమస్యలకు ఇది పరిష్కారం కాదు’’ అని అన్నారు.