IIM Amritsar: మా రూమ్స్‌లో ఏసీలు పెట్టండి మహాప్రభో.. విద్యార్థుల వినూత్న నిరసన
ABN , Publish Date - Jun 15 , 2024 | 11:47 AM
ఈ వేసవిలో ఎండలు ఎలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అఫ్‌కోర్స్.. చాలా చోట్ల వర్షాలు పడినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం వేడితాపం ఇంకా తగ్గలేదు.
ఈ వేసవిలో (Summer) ఎండలు ఎలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అఫ్‌కోర్స్.. చాలా చోట్ల వర్షాలు పడినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం వేడితాపం ఇంకా తగ్గలేదు. భానుడి ప్రతాపానికి ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పంజాబ్‌లో (Punjab) కొన్నిచోట్ల హీట్ వేవ్ ఉండగా.. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఏసీ లేకపోతే తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. అమృత్‌సర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM Amritsar) విద్యార్థులు ఏసీల కోసం వినూత్నమైన నిరసన చేపట్టారు. తమ హాస్టళ్లలో ఏసీలు పెట్టాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
మన దేశంలో ఉన్న ప్రీమియం మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో IIM ఒకటి. ఇందులోని మెస్, క్లాస్‌రూమ్‌లలో ఏసీలు ఉన్నాయి. కానీ.. హాస్టల్ గదులలో ఏసీలు అమర్చలేదు. వేడితాపం వల్ల విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే.. తమ గదుల్లో ఏసీలు బిగించాలని అక్కడి విద్యార్థులు కోరుతున్నారు. ఇందుకోసం.. లైబ్రరీలోని టేబుళ్లు, కుర్చీలపై పడుకొని వినూత్న నిరసనకు దిగారు. తమ గదుల్లో ఏసీలు పెట్టేదాకా నిరసన విరమించేదే లేదని తెగేసి చెప్తున్నారు. లక్షలకు లక్షలు ఫీజులు తీసుకొని.. గదుల్లో ఏసీలు పెట్టకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం.. ఈ విద్యార్థుల నిరసనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో.. వారికి మద్దతుగా నెటిజన్లు దిగొస్తున్నారు.
ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘నేను గతేడాదిలోనే IIM అమృత్‌సర్‌లో ఉత్తీర్ణత సాధించాను. విద్యార్థులు చేస్తున్న నిరసనలో నిజాయితీ ఉంది. ఎందుకంటే.. కొన్నిసార్లు ఆ హాస్టల్ గదుల్లో భరించలేని వేడి ఉంటుంది. నేను కూడా ఆ భయంకరమైన రోజుల్ని ఎదుర్కున్నాను. గతేడాదిలోనూ గదుల్లో ఏసీలు బిగించాలని డిమాండ్లు చేశాం. కానీ.. పెద్దగా ఫలితం దక్కలేదు. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు 45 నుంచి 50 డిగ్రీల వరకు ఉన్నట్టు అనిపిస్తుంది. అందులోనూ అక్కడున్న ఓ తాత్కాలిక హాస్టల్‌లో పరిస్థితి ఎలా ఉంటుందంటే.. లోపల కన్నా బయట ఉండటమే శ్రేయస్కరమని అనిపిస్తుంది’’ అంటూ రాసుకొచ్చాడు.
Read Latest National News and Telugu News