Share News

Dalit votes: లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి షాక్ ఇచ్చిన దళితులు.. భారీగా ఓట్ల శాతం తగ్గుదల

ABN , Publish Date - Jun 13 , 2024 | 08:44 AM

లోక్ సభ ఎన్నికల్లో వివిధ వర్గాల నుంచి పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. దళితుల ఓటు(Dalit votes) బ్యాంకు కీలకంగా కనిపిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో దళితులు ఉండటంతో ఈ ఎన్నికల్లో వారి ఓట్లు ఎవరికి ఎక్కువగా పడ్డాయన్నది ఆసక్తికరంగా మారింది.

Dalit votes: లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి షాక్ ఇచ్చిన దళితులు.. భారీగా ఓట్ల శాతం తగ్గుదల

ఢిల్లీ: ఎట్టకేలకు లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రంలో, రాష్ట్రాల్లో కొత్త సర్కార్‌లు కొలువుదీరాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ 293 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. 234 సీట్లతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. లోక్ సభ ఎన్నికల్లో వివిధ వర్గాల నుంచి పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. దళితుల ఓటు(Dalit votes) బ్యాంకు కీలకంగా కనిపిస్తోంది.

చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో దళితులు ఉండటంతో ఈ ఎన్నికల్లో వారి ఓట్లు ఎవరికి ఎక్కువగా పడ్డాయన్నది ఆసక్తికరంగా మారింది. సీఎస్డీఎస్ సర్వే ప్రకారం పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దళితుల ఓట్ల శాతం తగ్గుముఖం పట్టింది. వారి ఓట్లలో కాంగ్రెస్ ఒక్క శాతమే కోల్పోగా.. బీజేపీ ఏకంగా 3 శాతం ఓట్లను కోల్పోయింది. కాగా, కాంగ్రెస్ మిత్రపక్షాలకు దళితుల ఓట్లు ఎనిమిది శాతం మేర పెరిగాయి. యూపీలో ఇండియా కూటమికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ దళితుల ఓట్లతో అత్యధికంగా లాభపడింది.


ప్రతిసారి బీఎస్పీ వెంటుండే దళితులు ఈసారి ఎస్పీని ఆదరించడంతో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీతోపాటు దాని మిత్రపక్షాలకు 2 శాతం మేర ఓట్ల శాతం తగ్గింది. మహారాష్ట్ర, యూపీలాంటి చోట్ల బీజేపీకీ ఆ వర్గాల ప్రజలు ఊహించని దెబ్బ కొట్టారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో 25 శాతం, ఆదివాసీ ఓట్లు 36 శాతమే వచ్చాయి. యూపీలో 24 శాతం యాదవులు, 29 శాతం యాదవేతరులు బీజేపీకి ఓటు వేశారు.


బిహార్‌లో 65 శాతం మంది దుష్యులు, పాసీలు, 58 శాతం ఇతర కులాలవారు బీజేపీని ఆదరించారు. తమిళనాడులో కూడా 16 శాతం మంది దళితులు బీజేపీకి ఓటు వేశారు. దేశవ్యాప్తంగా 31 శాతం మంది బీజేపీకి, 36 శాతం మంది ఎన్డీయేకు ఓటు వేశారు. కాగా దళిత మహిళల ఓట్లలో బీజేపీకి 35 శాతం, కాంగ్రెస్‌కు 32 శాతం వచ్చాయి. 49 శాతం మంది గిరిజనులు బీజేపీకి ఓటేయగా, 32 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేశారు.

Updated Date - Jun 13 , 2024 | 08:45 AM