హెలికాప్టర్ ప్రమాదంలో.. ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం
ABN , Publish Date - May 21 , 2024 | 05:52 AM
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు, ఈదురుగాలులతో తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్‌లోని పర్వతాల మధ్య ఉన్న డిజ్మార్ అటవీ ప్రాంతంలో కూలిపోయిన విషయం తెలిసిందే.
విదేశాంగ మంత్రి సహా 8 మంది మృతి
వాతావరణ పరిస్థితి, కాలంచెల్లిన చాపర్తోనే..
టెక్నాలజీలో వెనుకంజతో వెదుకులాట జాప్యం
రేపు టెహ్రాన్ నగరంలో రైసీ అంత్యక్రియలు
తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బేర్
సంబంధాల బలోపేతానికి రైసీ కృషి: మోదీ
రైసీ మరణం.. ఇజ్రాయెల్‌పై నెటిజన్ల ట్రోల్!
మెగసెసె నుంచి వైఎస్ వరకు
నేతలను బలిగొన్న విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు
టెహ్రాన్, మే 20: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు, ఈదురుగాలులతో తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్‌లోని పర్వతాల మధ్య ఉన్న డిజ్మార్ అటవీ ప్రాంతంలో కూలిపోయిన విషయం తెలిసిందే. 20కి పైగా ప్రత్యేక బృందాలు, ఇరాన్ సైన్యం, ఇరాన్ రెడ్‌క్రిసెంట్ బృందాలు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) రాత్రంతా అటవీ ప్రాంతంలో గాలించి, సోమవారం తెల్లవారుజామున 5.30 సమయంలో(ఇరాన్ కాలమానం ప్రకారం) రైసీ హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశానికిచేరుకున్నాయి. హెలికాప్టర్ కూలిపోగానే చెలరేగిన మంటల్లో రైసీ, ఇరాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ అబ్దుల్లాహియాన్(60), తూర్పు అజర్బైజాన్ గవర్నర్ మాలిక్ రహ్మతీ, తబ్రీజ్ ప్రావిన్స్ ఇమామ్ సహా.. మొత్తం ఎనిమిది మంది మృతిచెందినట్లు గుర్తించారు. ఉదయం 8 గంటల సమయంలో ఇరాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
హెలికాప్టర్ శకలాలు, మృతదేహాలను తరలిస్తున్న చిత్రాలను మీడియాకు అందజేసింది. టెహ్రాన్‌లో బుధవారం రైసీ అంత్యక్రియలు జరుగుతాయని వివరించింది. అత్యవసరంగా భేటీ అయిన ఇరాన్ క్యాబినెట్.. ఐదు రోజులపాటు సంతాపదినాలను ప్రకటించింది. కాగా.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి రైసీ నమ్మిన బంటు. ఖమేనీకి రైసీనే వారసుడని సుప్రీంలీడర్‌ను ఎన్నుకునే 88 మంది సభ్యులున్న ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ’ సభ్యులంతా విశ్వసించేవారు. మరణించే వరకు రైసీ ఆ కమిటీకి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
ఇబ్రహీం రైసీ 1960 నవంబరులో మషాద్‌లో జన్మించారు. చిన్నతనం నుంచి ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపేవారు. అలా కోమ్ నగరంలో యువ మతగురువుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. రైసీకి ఖమేనీతో కోమ్లోనే పరిచయం ఏర్పడింది. పాశ్చాత్య మద్దతు ఉన్న షా పాలనకు వ్యతిరేకంగా 1979లో జరిగిన విప్లవోద్యమంలో రైసీ పాల్గొన్నారు. కాగా, ప్రమాదంపై దర్యాప్తునకు ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు. వైమానికదళం చీఫ్ అబ్దుల్లాహీకి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు
రైసీ అలియాస్ డెత్ కమిషన్!
యుద్ధ ఖైదీల పట్ల రైసీ అత్యంత క్రూరంగా వ్యవహరించేవారని, అందుకే ఆయనను ‘డెత్ కమిషన్’ అని పిలుస్తారని చెబుతుంటారు. 1988 ఇరాన్-ఇరాక్ యుద్ధ ఖైదీల విచారణకు రైసీ దేశవ్యాప్తంగా ‘డెత్ కమిషన్’లను నియమించారు. యుద్ధ ఖైదీలపై ఎలాంటి విచారణ లేకుండానే మరణ శిక్షలను విధించడం ‘డెత్ కమిషన్’ లక్ష్యం..! ఇలా అప్పట్లో 5 వేల మందికి పైగా యుద్ధ ఖైదీలను దారుణంగా హతమార్చారనే అభియోగాలున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఈ దారుణాలపై రైసీని విచారించాలని పిలుపునిచ్చింది. ఇరాన్లో మరణ శిక్ష అంటే ఉరి ఒక్కటే కాదు..! రాళ్లతో కొట్టి చంపడం, కొండ శిఖరాల నుంచి కిందకు తోసేయడం వంటి శిక్షలు ఉంటాయి. యుద్ధ ఖైదీలే కాకుండా.. ప్రభుత్వ విధానాలను విమర్శించే వారినీ ఇలాగే చిత్ర హింసలు పెట్టి, చంపేవారని సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హాదీ ఘేమీ పేర్కొన్నారు. అలా క్రూరమైన శిక్షలతో రాజకీయ ప్రత్యర్థులను వణికించిన రైసీ దారుణాలు 2017 అధ్యక్ష ఎన్నికల సమయంలో వెలుగులోకి వచ్చాయి. ఆ ఎన్నికల్లో హసన్ రౌహాని చేతిలో రైసీ ఓడిపోయారు. డెత్ కమిషన్‌పై విచారణ జరిపించిన అమెరికా 2019లో రైసీపై ఆంక్షలను విధించింది. 2021 ఎన్నికల్లో రైసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హమాస్, హౌతీ, హిజ్బుల్లా, ఇస్లామిక్ జిహాద్ ఉగ్రసంస్థలను రైసీ పెంచి, పోషించారనే ఆరోపణలున్నాయి.
ప్రపంచ దేశాధినేతల దిగ్ర్భాంతి
రైసీ మృతిపట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రైసీ మరణం ఇరానీయులు తీరని లోటని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. చైనా ఓ మంచి మిత్రుణ్ని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. కాగా, రైసీ గౌరవార్థం న్యూఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ సోమవారం రాయబార కార్యాలయంలోని ఇరాన్ జెండాను అవనతం చేసింది.
తాత్కాలిక అధ్యక్షుడిగా మొఖ్బేర్
రైసీ మరణంతో ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బేర్ నియమితులయ్యారు. ప్రస్తుతం మొఖ్బేర్ మొదటి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణించినా.. రాజీనామా చేసినా.. ఉపాధ్యక్షుల్లో మొదటి స్థానంలో ఉన్నవారిని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తారు. ఆ తర్వాత 50 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. రైసీతోపాటు హెలికాప్టర్లో ఉన్న విదేశాంగ మంత్రి ఆమిర్ అబ్దుల్లాహియాన్ మరణించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో మహమ్మద్ అలీ బఘేరీని నియమిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే తేదీని ఇరాన్ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జూన్ 29న కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని తెలిపింది.
రైసీ మృతి దిగ్ర్భాంతిని కలిగించింది
రైసీ మరణ వార్త తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. భారత్-ఇరాన్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి మరవలేనిది. ఆయన కుటుంబ సభ్యులకు, ఇరాన్ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ విచార సమయంలో ఇరాన్‌కు అండగా ఉంటాం. రైసీ, అబ్దుల్లాహియాన్, ఇతర అధికారుల సంస్మరణార్థం భారత్‌లో ఒక రోజు సంతాప దినాన్ని ప్రకటిస్తున్నాను.
- భారత ప్రధాని నరేంద్ర మోదీ
టెక్నాలజీలో వెనకంజలో ఇరాన్!
వెపన్ గ్రేడ్ యురేనియం తయారీలో ఇరాన్ ముందున్నా.. టెక్నాలజీలో వెనకంజలో ఉన్నట్లు తాజా హెలికాప్టర్ ప్రమాదం స్పష్టం చేస్తోంది. రైసీ ప్రయాణానికి వినియోగించిన హెలికాప్టర్ బెల్-212 కేటగిరీకి చెందినది. ఇది అమెరికా తయారీ. 1970లలో కొనుగోలు చేసిన హెలికాప్టర్. ఇదొక్కటే కాదు.. ఇరాన్ సైన్యం వాడుతున్న హెలికాప్టర్లు, యుద్ధ విమానాల్లో సింహభాగం కాలం చెల్లినవే..! ఇరాన్‌పై ఆంక్షల కారణంగా వీటి మరమ్మతులకు విడిభాగాలను కూడా దిగుమతి చేసుకోలేని స్థితిలో ఇరాన్ ఉంది. ప్రతికూల వాతావరణానికి..
దాదాపుగా కాలం చెల్లిన హెలికాప్టర్ తోడవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు.. కూలిన హెలికాప్టర్‌ను గాలించడంలో ఇరాన్ విఫలమైనట్లు స్పష్టమవుతోంది. హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం కూలిపోతే.. సోమవారం తెల్లవారుజాము వరకు దాని జాడను కనుక్కోలేకపోయారు. రాత్రిళ్లు అడవుల్లో గాలింపు చేపట్టే టెక్నాలజీకి కూడా ఇరాన్ నోచుకోలేదు. తుర్కియే, జోర్దాన్ వంటి దేశాలు ముందుకు రావడంతోనే.. రాత్రంతా గాలింపు సులభమైంది. హెలికాప్టర్ పైలట్ వాడిన సెల్‌ఫోన్ లొకేషన్‌ను గుర్తించడంలోనూ తుర్కియే సాంకేతిక సమాచారం అందించింది.