Share News

Bangladesh Riots: ఆ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!

ABN , Publish Date - Aug 06 , 2024 | 11:29 AM

బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఇవాళ(మంగళవారం) అఖిలపక్ష నేతలను కలవనున్నారు. దీనికి సంబంధించి ఆ దేశ పరిస్థితులను ఇప్పటికే ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. బంగాదేశ్ పరిస్థితులపై విదేశాంగ, హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులతోపాటు ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు.

Bangladesh Riots: ఆ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!

ఢిల్లీ: బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఇవాళ(మంగళవారం) అఖిలపక్ష నేతలను కలవనున్నారు. దీనికి సంబంధించి ఆ దేశ పరిస్థితులను ఇప్పటికే ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. బంగాదేశ్ పరిస్థితులపై విదేశాంగ, హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులతోపాటు ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. సరిహద్దు వెంట పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గత రెండ్రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు, బంగ్లాదేశ్ తాజా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌కు రావడం, సరిహద్దు భద్రత వంటి అంశాలను అఖిలపక్ష నేతలకు కేంద్ర మంత్రి వివరించనున్నారు. అఖిలపక్ష భేటీ తర్వాత ఉభయ సభల్లో జై శంకర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.


సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం..

మరోవైపు పశ్చిమబెంగాల్, అస్సాం ప్రాంతాల్లో బంగ్లా సరిహద్దులను భద్రతాదళాలు కట్టుదిట్టం చేశాయి. గత రెండ్రోజులుగా బంగ్లా సరిహద్దుల్లోనే బీఎస్ఎఫ్ చీఫ్ నితిన్ అగర్వాల్ మకాం వేశారు. షేక్ హసీనా భారత్‌కు రావడంతో ఆందోళనకారులు సైతం వచ్చే ప్రమాదం ఉన్నందుకు అన్ని సరిహద్దుల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు బంగ్లాదేశ్ ఢాకా నుంచి విమాన సర్వీసులను కూడా కేంద్రం ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.


బంగ్లాదేశ్ అల్లర్లు..

బంగ్లాదేశ్‌లో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30శాతం రిజర్వేషన్‌ను నిరసిస్తూ అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆందోళన కారులపై షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని చూసింది. దాంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోవడంతో రంగంలోకి దిగిన ఆర్మీ.. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఆదివారం ఒక్కరోజే 100మంది ఆందోళనకారులు మృతిచెందారు. ఇప్పటివరకూ అల్లర్లలో 300మంది వరకూ చనిపోయారు.


ఈ పరిణామాల అనంతరం ఆ దేశ ప్రధాని షేక్ హసీనా నిన్న తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్నారు. అనంతరం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ ఆధ్వర్యంలో సైనిక పాలన విధించారు. ఆ దేశంలో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే కొత్తగా ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి విద్యార్థి సంఘాల వేదిక ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ కీలక ప్రతిపాదన చేసింది. కొత్త ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా నోబెల్ గ్రహీత డాక్టర్ ముహమ్మద్​ యూనస్‌ను నియమించాలని విజ్ఞప్తి చేసింది.

Updated Date - Aug 06 , 2024 | 11:34 AM