Share News

Marriage: పెళ్లి.. చాలా కాస్ట్‌లీ గురూ!

ABN , Publish Date - Jul 07 , 2024 | 04:51 AM

ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే వేడుక పెళ్లి. తల్లిదండ్రులు తమ హోదాకు తగినట్టు ఖర్చుకు వెనుకాడకుండా పిల్లల వివాహాలను వైభవంగా జరిపిస్తారు. పేదలు కూడా అప్పు చేసైనా ఉన్నంతలో చేస్తారు.

Marriage: పెళ్లి.. చాలా కాస్ట్‌లీ గురూ!

  • ఈ ఏడాది అంచనా 10.85 లక్షల కోట్లు

  • అమెరికాలో కంటే భారత్‌లో రెట్టింపు వ్యయం

న్యూఢిల్లీ, జూలై 6: ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే వేడుక పెళ్లి. తల్లిదండ్రులు తమ హోదాకు తగినట్టు ఖర్చుకు వెనుకాడకుండా పిల్లల వివాహాలను వైభవంగా జరిపిస్తారు. పేదలు కూడా అప్పు చేసైనా ఉన్నంతలో చేస్తారు. ధనవంతులైతే కోట్లకు కోట్లు ఖర్చు చేసేస్తారు. మన దేశంలో ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ల కోసం చేస్తున్న ఖర్చు బాగా పెరిగిపోతోంది. జెఫరీజ్‌ గ్రూప్‌ నివేదిక ప్రకారం... ఈ ఏడాది మన దేశంలో పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు దాదాపు రూ.10.85 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా! భారతీయులు ఆహారం, కిరాణ సరుకుల కోసం చేసే వ్యయం తర్వాత పెళ్లిళ్లకు చేసే ఖర్చు రెండో స్థానంలో ఉంది. పిల్లల చదువు కోసం చేసే ఖర్చు కంటే పెళ్లిళ్లకు రెట్టింపు చేస్తున్నారు. భారతీయులు సగటున ఓ పెళ్లికి రూ.12 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఈ నెలలో పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభమవుతుంది. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతాయి. దాదాపు 90 శాతం వివాహాలు పెద్దలు కుదిర్చినవే.

ప్రత్యేకతలు

ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో ఏటా దాదాపు 80 లక్షల నుంచి కోటి వివాహాలు జరుగుతాయి. అమెరికాతో పోలిస్తే భారత్‌లో వివాహాలకు రెట్టింపు ఖర్చు చేస్తారు. చైనాతో పోలిస్తే మాత్రం భారత్‌లోనే ఖర్చు తక్కువ.

కొత్త ట్రెండ్‌

సాధారణంగా వధువు సొంతూరులోనో లేదా వధూవరుల కుటుంబాలకు అనుకూలమైన చోట వివాహ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇటీవల కాలంలో వివాహ సంప్రదాయంలో కొత్త ట్రెండ్‌ మొదలైంది. డబ్బున్నవారు గోవా, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అండమాన్స్‌ వంటి ప్రాంతాలకు వెళ్లి అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు చేసుకుంటున్నారు.

ఉపాధి

పెళ్లిళ్ల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. కేటరింగ్‌, డెకరేషన్‌, గిఫ్టులు, ఫొటోగ్రాఫర్స్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఆటో మొబైల్స్‌, పెయింట్స్‌, ట్రావెల్‌, ప్లానర్స్‌ తదితరాలకు భారీగా ఖర్చు చేస్తారు. పెళ్లి బడ్జెట్‌లో ఎక్కువగా బంగారు ఆభరణాలకు ఖర్చు చేస్తారు.

Updated Date - Jul 07 , 2024 | 07:16 AM