Share News

Maharashtra: పూజా ఖేద్కర్‌ తల్లి అరెస్టు..

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:15 AM

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ తల్లి మనోరమ ఖేద్కర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. భూ వివాదంలో రైతులను గన్‌తో బెదిరించిన వీడియో వైరల్‌ అయిన నేపథ్యంలో మనోరమతోపాటు ఆమె భర్త దిలీప్‌ ఖేద్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Maharashtra: పూజా ఖేద్కర్‌ తల్లి అరెస్టు..

  • హత్యాయత్నం కేసు.. రెండు రోజుల కస్టడీ

ముంబై, జూలై 18: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ తల్లి మనోరమ ఖేద్కర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. భూ వివాదంలో రైతులను గన్‌తో బెదిరించిన వీడియో వైరల్‌ అయిన నేపథ్యంలో మనోరమతోపాటు ఆమె భర్త దిలీప్‌ ఖేద్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ దంపతులిద్దరూ పరారీలో ఉన్నారు. పుణె జిల్లా మహద్‌లోని ఓ లాడ్జిలో దాక్కున్న మనోరమను గురువారం ఉదయం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, జడ్జి రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు. ఆమెపై భారతీయ న్యాయ సంహిత చట్టంలోని వివి ధ సెక్షన్లతోపాటు తాజాగా హత్యాయత్నం అభియోగాలను నమోదు చేశారు.


ఇప్పటికే ఆమె కుమార్తె పూజా ఖేద్కర్‌కు నకిలీ పత్రాలతో ఐఏఎ్‌సకు ఎంపికైన, అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసుల్లో ఉచ్చు బిగుస్తోంది. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దిలీప్‌ ఖేద్కర్‌పై బహిరంగ విచారణ జరపాలంటూ పుణె ఏసీబీ(అవినీతి నిరోధక బ్యూరో)కి ఫిర్యాదు అందింది. మహారాష్ట్ర రిటైర్డ్‌ ప్రభుత్వ అధికారి అయిన దిలీప్‌ వ్యాపార వేత్తలను ముడుపులు డిమాండ్‌ చేసిన అభియోగాలతో రెండు సార్లు సస్పెన్షన్‌కు గురైనట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘దిలీ్‌పపై ఇప్పటికే అహ్మద్‌నగర్‌ యూనిట్‌లో నాసిక్‌ ఏసీబీ బహిరంగ విచారణ జరుపుతోంది.


తాజాగా, ఆయనపై బహిరంగ విచారణ జరపాలని ఫిర్యాదుదారు నుంచి మాకు అభ్యర్థన అందింది. ఫిర్యాదుదారు వాంగ్మూలాన్ని నమోదు చేసి, దానితోపాటు ఆధారాలను ఏసీబీ ప్రధానకార్యాలయానికి పంపించాం’ అని పుణె ఏసీబీ ఎస్పీ అమోల్‌ తాంబే చెప్పారు. తాజా ఫిర్యాదును ఇప్పటికే కొనసాగుతున్న దర్యాప్తులో కలిపి విచారించాలా? లేక విడిగా విచారణ జరపాలా? అనే విషయంపై ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి మార్గనిర్దేశం కోరామని తెలిపారు.

Updated Date - Jul 19 , 2024 | 05:15 AM