Pakistan: అలా చేయకపోతే.. పాకిస్తాన్ అణుబాంబులేయడం తథ్యం
ABN , Publish Date - May 10 , 2024 | 02:59 PM
పాకిస్తాన్‌ని గౌరవించకుండా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే.. దానికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పాక్‌ని గౌరవించకపోతే..
పాకిస్తాన్‌ని (Pakistan) గౌరవించకుండా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే.. దానికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ (Manishankar Aiyer) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పాక్‌ని గౌరవించకపోతే.. తన వద్ద ఉండే అణుబాంబులు (Atom Bombs) ఆ దేశం భారత్‌పై ప్రయోగించే ప్రమాదం ఉందంటూ కుండబద్దలు కొట్టారు. ఆ దేశంతో చర్చలు జరిపి, సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. ఈ విధంగా ఆయన మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. అది దేశ రాజకీయాల్లో పెను దుమారానికి దారి తీసింది.
‘‘పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి. భారత్ వద్ద కూడా ఉన్నాయి. కానీ, ఓ పిచ్చోడు లాహోర్‌పై బాంబు వేయాలని నిర్ణయించుకుంటే.. దాని రేడియేషన్ అమృత్‌సర్‌కు చేరుకోవడానికి 8 సెకన్ల సమయం కూడా పట్టదు’’ అని మణిశంకర్ అయ్యర్ ఆ వీడియోలో హెచ్చరించారు. మనం పాక్‌ని గౌరవిస్తే వాళ్లు శాంతియుతంగా ఉంటారని, అలా కాకుండా భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోకాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. విశ్వగురువుగా మారాలంటే.. పాక్‌తో మన సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. కానీ.. గత పదేళ్లలో అలాంటిదేమీ చేయలేదని మణిశంకర్ దుయ్యబట్టారు.
కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..
అయితే.. ఈ వీడియో ఇప్పటిది కాదు. ఏప్రిల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మణిశంకర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ.. అయ్యర్ వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసం పాత వీడియోని బీజేపీ ఉద్దేశపూర్వకంగానే బయటకు తీసి వైరల్ చేస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. కాగా.. భారత్‌కు హాని తలపెట్టే ముష్కరులు పారిపోయినా, వేటాడి మరీ వారిని హతమారుస్తామని ప్రధాని మోదీ సహా పలువురు నేతలు ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూనే.. అయ్యర్ పైవిధంగా రియాక్ట్ అయినట్లు సమాచారం.
Read Latest National News and Telugu News