RSS: బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య గ్యాప్ పెరిగిందా.. మోహన్ భగవత్ ఏమన్నారంటే?
ABN , Publish Date - Jun 16 , 2024 | 03:25 PM
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ(BJP) అనుకున్నమేర ప్రభావం చూపకపోవడంతో ఆర్ఎస్ఎస్‌కి బీజేపీకి మధ్య విభేదాలు వచ్చాయని వదంతులు వెలువడ్డాయి. ఈ విషయంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) ఆదివారం స్పష్టతనిచ్చారు.
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ(BJP) అనుకున్నమేర ప్రభావం చూపకపోవడంతో ఆర్ఎస్ఎస్‌కి బీజేపీకి మధ్య విభేదాలు వచ్చాయని వదంతులు వెలువడ్డాయి. ఈ విషయంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) ఆదివారం స్పష్టతనిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పర్యటనలో ఉన్న ఆయన.. 2025నాటికి ఊరూరికి వెళ్లి ఆర్ఎస్ఎస్ భావాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వాలంటీర్లకు సూచించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా కలవాలని భావిస్తున్న భగవత్, దేశ నిర్మాణానికి ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న నిస్వార్థ సేవాసహకారాల గురించి ప్రజలకు తెలియజేయడానికి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
“భగవత్ పర్యటన నిత్యం జరిగేదే. వాలంటీర్లను చైతన్యవంతం చేసేందుకు ప్రస్తుతం జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు" అని ఆయన సన్నిహితులు తెలిపారు.
ఆదిత్యనాథ్ స్వస్థలమైన గోరఖ్‌పూర్‌లో భగవత్ పర్యటన నేపథ్యంలో.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై చర్చలు జరిగాయి. ఈ ఎన్నికల్లో యూపీలో బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకుంది. దీంతో RSS, BJP మధ్య చీలిక వచ్చిందంటూ వదంతులు వ్యాపించాయి. “ఆర్ఎస్ఎస్ 2025లోకి ప్రవేశించబోతోంది. ఆ ఏడాదిని RSSకి శతాబ్ది సంవత్సరంగా గుర్తిస్తాం. 2025 ఏడాది ప్రారంభంనాటికి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతి గ్రామానికి చేరుకోవాలి. భారతీయ సంస్కృతి, దాని విలువలను కాపాడుకోవడం చాలా ముఖ్యం”అని ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో వాలంటీర్లను ఉద్దేశించి భగవత్ అన్నారు.
యూపీ వ్యాప్తంగా 250 మందికిపైగా వాలంటీర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ప్రసంగించడం వారి మనోధైర్యాన్ని పెంచింది. భారతీయ సంస్కృతి, విలువలను చెక్కుచెదరకుండా ఉంచాలనే లక్ష్యంతో ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం, నినాదంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన వారికి సూచించారు.
“సంఘ్‌పై నెగిటివ్ ఇమేజ్ సృష్టించే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆర్‌ఎస్‌ఎస్ సహకారం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, కొవిడ్ కాలంలో సంఘ్ వాలంటీర్లు.. బాధితులకు, వారి కుటుంబాలకు ఎలా సాయం చేశాయో ప్రజలు చూశారు. దేశంలో ఏదైనా సంక్షోభం ఏర్పడితే దానిని ధైర్యంగా ఎదుర్కొనేది ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధంగా ఉంది. అయితే సంఘ్‌పై నెగిటివ్ ఇమేజ్‌ని సృష్టించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి నుంచి దూరంగా ఉండాలి”అని భగవత్ పేర్కొన్నారు.