Share News

Chennai : గాల్లో ప్రాణాలు

ABN , Publish Date - Oct 12 , 2024 | 04:54 AM

తమిళనాడులోని తిరుచ్చి నుంచి షార్జాకు బయలుదేరిన విమానానికి పెద్ద ముప్పు తప్పింది. 141 మంది ప్రయాణికులు ఉన్న ఆ విమానం సాంకేతిక లోపంతో రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టి.. చివరకు క్షేమంగా కిందకు దిగడంతో ఉత్కంఠకు తెరపడి అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Chennai : గాల్లో ప్రాణాలు

  • తిరుచ్చి- షార్జా విమానంలో సాంకేతిక లోపం

  • మొరాయించిన ఎయిర్‌ ఇండియా విమానం చక్రాలు

  • రెండున్నర గంటలకు పైగా ఆకాశంలోనే చక్కర్లు

  • చివరకు సేఫ్‌ ల్యాండింగ్‌తో తప్పిన ముప్పు

చెన్నై, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని తిరుచ్చి నుంచి షార్జాకు బయలుదేరిన విమానానికి పెద్ద ముప్పు తప్పింది. 141 మంది ప్రయాణికులు ఉన్న ఆ విమానం సాంకేతిక లోపంతో రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టి.. చివరకు క్షేమంగా కిందకు దిగడంతో ఉత్కంఠకు తెరపడి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం సాయంత్రం 5.40కి తిరుచ్చి అంతర్జాతీయ విమాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా ఏఎక్స్‌బీ 613 నంబర్‌ విమానం షార్జాకు బయలుదేరింది. హైడ్రాలిక్‌ లోపంతో ఆ విమానం చక్రాలు ముడుచుకోకుండా మొరాయించాయి.

సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్‌ డేనియల్‌ ఫెలిసో వెంటనే అటు షార్జాలోని విమానాశ్రయ కంట్రోల్‌ రూమ్‌ అధికారులకు, ఇటు తిరుచ్చి విమానాశ్రయం కంట్రోల్‌ రూమ్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. విమానం షార్జాకు రావడానికి అక్కడి అధికారులు నిరాకరించారు. పూర్తి స్థాయిలో ఇంధనం ఉన్న విమానాన్ని ఇక్కడ వెంటనే ల్యాండింగ్‌ చేయడం సముచితం కాదని తిరుచ్చి విమానాశ్రయం అధికారులు భావించారు. సేఫ్‌ ల్యాండింగ్‌ కోసం ఇంధనం ఖర్చు చేయడానికి రెండున్నర గంటలకు పైగా తిరుచ్చి వినువీధుల్లో ఆ విమానాన్ని చక్కర్లు కొట్టించారు. చక్రాలు పనిచేయని సమయంలో చేసే బెల్లీ ల్యాండింగ్‌ కోసం కూడా అనుమతినిచ్చారు.


విషయం తెలుసుకున్న పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెంటనే స్పందించి డీజీసీఏ అధికారులను అప్రమత్తం చేశారు. సేఫ్‌ ల్యాండింగ్‌ కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టకేలకు బెల్లీ ల్యాండింగ్‌ అవసరం లేకుండానే 8.15 గంటలకు విమానం క్షేమంగా కిందకు దిగింది. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చున్న ప్రయాణికులు కేరింతలు కొట్టారు. విమానం సేఫ్‌ ల్యాండింగ్‌తో అటు అధికారులు, ఇటు ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా సాంకేతిక లోపంతో ఆకాశంలో విమానం చక్కర్లు కొడుతోందన్న వార్తలు వెలువడగానే ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఆ విమానం జాడను కనుగొనేందుకు ట్రాకింగ్‌ చేశారు.

  • డీజీసీఏ హెచ్చరించినా..

బోయింగ్‌ 737 విమానాల చుక్కానిలో సాంకేతిక లోపం ఉందని, సరిదిద్దుకోవాలని ఈనెల 7న డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) విమానయాన సంస్థలకు సూచించింది. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఆకాశ ఎయిర్‌, స్పైస్‌ జెట్‌ సంస్థలు బోయింగ్‌ 737 విమానాలను నడుపుతున్నాయి. వీటి వెనకవైపు ఉండే చుక్కాని కంట్రోల్‌ సిస్టం జామ్‌ అయ్యే అవకాశం ఉందని అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్‌టీఎ్‌సబీ) సూచించిన నేపథ్యంలో డీజీసీఏ ఆ హెచ్చరిక జారీ చేసింది. తమ విమానాల్లో ఐదింటికి మాత్రమే ఆ సమస్య వచ్చే అవకాశం ఉందని, సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ఎయిర్‌ ఇండియా తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విమానంలో సాంకేతిక లోపానికి కారణాలు అన్వేషించేందుకు అంతర్జాతీయ స్థాయి విచారణ చేపడుతున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

Updated Date - Oct 12 , 2024 | 05:09 AM