Share News

Train Collision: రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. పరిహారం ప్రకటించిన కేంద్రం

ABN , Publish Date - Jun 17 , 2024 | 01:26 PM

పశ్చిమ బెంగాల్‌‌లో సోమవారం ఉదయాన్నే ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.

Train Collision: రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. పరిహారం ప్రకటించిన కేంద్రం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌‌లో సోమవారం ఉదయాన్నే ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరింది. దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘డార్జిలింగ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో పలువురు మరణించిన వార్త బాధ కలిగించింది.


మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రాష్ట్రపతి ఎక్స్‌లో పేర్కొన్నారు. రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ (PM Modi) సైతం విచారం వ్యక్తం చేశారు. ‘బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదం బాధాకరం. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు PMNRF (ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50వేలు ఇస్తామని పీఎంఓ తెలిపింది.


జరిగిందిదే..

అసోంలోని సిల్చార్‌ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయల్దేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ (Kanchanjunga Express) రైలును న్యూజల్‌పాయ్‌ గుడి జంక్షన్‌ సమీపంలోని రంగపాని స్టేషన్‌ వద్దకు రాగానే అదే ట్రాక్‌పై వెనుకనుంచి వచ్చిన ఓ గూడ్స్‌ రైలు బలంగా ఢీ కొట్టింది. దీంతో కాంచన్‌జంగా రైలుకు చెందిన ఓ బోగీ గాల్లోకి లేచింది.

ప్రమాద తీవ్రతకు బోగీలు చెల్లాచెదురయ్యాయి. పరిస్థితిని సీఎం మమతా బెనర్జీ సమీక్షించారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కాగా.. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jun 17 , 2024 | 01:32 PM