Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన.. వర్కవుట్ అయ్యేనా?
ABN , Publish Date - Aug 25 , 2024 | 07:26 PM
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. తమ 'జన్ సురాజ్' పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల్లో పోటీ చేస్తుందని, వీరిలో కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు ఉంటారని తెలిపారు.
పాట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections)కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. తమ 'జన్ సురాజ్' (Jan Suraaj) పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల్లో పోటీ చేస్తుందని, వీరిలో కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు ఉంటారని తెలిపారు. 2030 నాటికి కనీసం 70-80 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పారు.
''మహిళలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చేంత వరకూ వారికి సమానత్వం సాధ్యం కాదు. వారి జీవనోపాధి కోసం 4 శాతం రుణాలివ్వాలి. ఈ మేరకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి'' అని పీకే అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తక్కువ సంపాదన కోసం బీహార్ నుంచి వలసలు ఉండవని చెప్పారు. నాయకుల కుమారులనో, కుమార్తెలనో కాకుండా తమ కుమారులు, కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Mayawati on caste census: కులగణనపై కాంగ్రెస్‌కు క్లాస్..
తేజస్విని చూస్తే నవ్వొస్తుంది..
అభివృద్ధి నమూనా గురించి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడటం తనకు నవ్వుతెప్పిస్తుందని పీకే అన్నారు. ఆయన ఏ పార్టీలో ఉంటున్నారో ఆ పార్టీ 15 ఏళ్లు బీహార్‌ను పాలిచిందని, ఆయనకు జీడీపీ, జీడీపీ వృద్ధి రేటు గురించి కూడా తెలియదని ఆక్షేపించారు. బీహార్‌లో నేరాలకు సంబంధించి మాట్లాడుతూ, తేజస్వి యాదవ్ ఆరు నెలల క్రితం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని, అప్పుడు బీహార్ స్విట్జర్లాండ్‌గా అనిపించిందని, ఆ తర్వాత ఆరునెలలకు బీహార్ రగులుతున్నట్టు కనిపిస్తోందని చెప్పారు. ఇవాళ నితీష్ కుమార్ తిరిగి మహాఘట్‌బంధన్‌లో చేరిన బీహార్ మళ్లీ ఆయనకు గొప్పగా కనిపిస్తుందని అన్నారు.
రాహుల్ 'కులగణన' సర్వరోగ నివారిణి కాదు..
కులగణనతో పేదరికం రూపుమాపడం, ప్రజల స్థితిగతులు మెరుగుపడతాయని రాహుల్ గాంధీ చెబుతున్నారని, ఆయన పార్టీ (కాంగ్రెస్) 60 ఏళ్లు అధికారంలో ఉందని, అప్పుడెందుకు కులగణన జరిపించ లేదని పీకే ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, తదితర రాష్ట్రాల్లో కులగణన నిర్వహించి విజయవంతంగా పేదరికం నిర్మూలిస్తే, తక్కిన రాష్ట్రాలు కూడా అదే మోడల్‌ను అనుసరిస్తాయని సూచించారు. కులగణన చేపట్టినంత మాత్రన అదే సర్వరోగ నివారిణి కాదని పీకే అభిప్రాయపడ్డారు.
Read More National News and Latest Telugu News