President of Maldives : మాల్దీవుల పర్యటనకు రండి!
ABN , Publish Date - Oct 08 , 2024 | 04:28 AM
తమ దేశంలో పర్యటనకు రావాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు, భారత్‌తో విభేదాలతో తమ పర్యాటక ఆదాయం పడిపోయిన నేపథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.
భారతీయులకు ముయిజ్జు విజ్ఞప్తి.. మాల్దీవుల్లో రూపే కార్డు సేవలు ప్రారంభం
న్యూఢిల్లీ, అక్టోబరు 7: తమ దేశంలో పర్యటనకు రావాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు, భారత్‌తో విభేదాలతో తమ పర్యాటక ఆదాయం పడిపోయిన నేపథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం భారత్‌కు వచ్చేసిన ముయిజ్జు, సాజిదా దంపతులు సోమవారం రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు వారికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. తర్వాత ప్రధాని మోదీతో ముయిజ్జు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాలూ పలు ఒప్పందాలు చేసుకున్నాయి.
అనంతరం మోదీతో సంయుక్త విలేకరుల సమావేశంలో ముయిజ్జు మాట్లాడుతూ ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న విదేశీ మారక సమస్యలను అధిగమించేందుకు భారత్ అందిస్తున్న సహాయసహకారాలు చాలా కీలకంగా మారనున్నాయంటూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆపన్న హస్తం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందని మోదీ స్పష్టం చేశారు. విదేశాంగ విధానంలో పొరుగువారికే తొలి ప్రాధాన్యం ఇస్తామని నొక్కి చెప్పారు. మాల్దీవులను ‘సన్నిహిత మిత్రుడి’గా అభివర్ణించారు. ఆ దేశానికి ఎదురైన అత్యవసర పరిస్థితుల్లోనూ, కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా విషయంలోనే ముందుగా స్పందించినది భారతదేశమేనని గుర్తుచేశారు.
భారత సాయంతో మాల్దీవుల్లో చేపట్టిన హనిమదూ అంతర్జాతీయ విమానాశ్రయ ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నూతన రన్‌వేను ఇరువురు నేతలు ఈ సందర్భంగా వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతోపాటు మాల్దీవుల్లో రూపేకార్డు ద్వారా చెల్లింపులు జరిపే ప్రక్రియనూ ప్రారంభించారు. తద్వారా భారత పర్యాటకులు మాల్దీవులలో నగదు రహిత చెల్లింపులు చేయడం సులభం కానుంది. విదేశీ మారక నిల్వల సమస్యను మాల్దీవులు అధిగమించేలా రూ.3,359 కోట్లు(400 మిలియన్ డాలర్లు), మరో రూ.3 వేల కోట్ల కరెన్సీ స్వాప్ ఒప్పందాన్ని కూడా ఈ సందర్భంగా ప్రకటించారు.