Share News

PM Modi : పాకిస్థాన్‌ ఆట కట్టిస్తాం

ABN , Publish Date - Jul 27 , 2024 | 05:01 AM

దాయాది పాకిస్థాన్‌ ఉగ్ర కుట్రలను సైన్యం తిప్పికొడుతుందని ప్రదానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘‘ఉగ్రవాద ఘాతుకాలు, దొంగ యుద్ధాలతో కవ్వింపు చర్యలకు పాకిస్థాన్‌ పాల్పడుతూనే ఉంది.

PM Modi : పాకిస్థాన్‌ ఆట కట్టిస్తాం

  • గతం నుంచి అది ఏమీ నేర్చుకోలేదు

  • దాయాది ఉగ్ర కుట్రలు అణచివేస్తాం

  • ఆర్మీలో గొప్ప సంస్కరణ అగ్నిపథ్‌

  • యుద్ధ సన్నద్ధతా పెరిగింది: మోదీ

  • కార్గిల్‌ విజయ్‌ దివస్‌కు పాతికేళ్లు

  • ద్రాస్‌లో సైనికులతో గడిపిన ప్రధాని

  • ఆర్మీ మీద రుద్దిన స్కీమ్‌ అగ్నిపథ్‌

  • కార్గిల్‌పైనా రాజకీయాలా: కాంగ్రెస్‌

ద్రాస్‌ (లద్దాఖ్‌), జూలై 26 : దాయాది పాకిస్థాన్‌ ఉగ్ర కుట్రలను సైన్యం తిప్పికొడుతుందని ప్రదానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘‘ఉగ్రవాద ఘాతుకాలు, దొంగ యుద్ధాలతో కవ్వింపు చర్యలకు పాకిస్థాన్‌ పాల్పడుతూనే ఉంది. దాని ఆట కట్టిస్తాం. ముష్కరుల దుశ్చర్యలను అణచివేస్తాం’’ అంటూ తీవ్ర స్వరం వినిపించారు. భారత వీర జవాన్ల శౌర్యానికి ప్రతీకగా నిలిచిన కార్గిల్‌ యుద్ధానికి నేటితో పాతికేళ్లు.

Untitled-1 copy.jpg

విజయ్‌దివ్‌సగా ఈ సందర్భాన్ని భారతావని శుక్రవారం ఘనంగా జరుపుకొంది. ఆ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు, ఆ యుద్ధం జరిగిన కార్గిల్‌ ప్రాంతంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. విధుల్లో ఉన్న సైనికులతో కలిసి విజయ్‌దివ్‌సను జరుపుకొన్నారు. అక్కడ ఏర్పాటుచేసిన కార్గిల్‌ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు మోదీ గట్టి హెచ్చరిక చేశారు.

జమ్మును కేంద్రం చేసుకుని గత నెల రోజుల్లోనే ఉగ్రవాదులు ఆరుకు పైగా భారీ దాడులు చేశారు. ఈ నేపథ్యంలో మోదీ తీవ్రంగా స్పందించారు. ‘‘పాక్‌ చరిత్ర అంతా ఓటములతో నిండిపోయింది. అయినా ఇప్పటికీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. వారి నీచ ఉద్దేశ్యాలు ఏనాటికీ నెరవేరవు. ఉగ్రవాద పోషకులు కూడా వినగలిగే చోటులో నిలబడి నేను ఈ మాట చెబుతున్నాను’’ అని హెచ్చరించారు.


అసత్య కథనాలు, ఉగ్రవాద ఉన్మాదంపై సత్యం సాధించిన విజయమే కార్గిల్‌ యుద్ధమని మోదీ అభివర్ణించారు. కార్గిల్‌లో భారత్‌ యుద్ధాన్ని మాత్రమే గెలవలేదని, తిరుగులేని తన సామర్థాన్ని ప్రదర్శించిందని, అసాధారణ రీతిలో సత్యాన్ని ఆవిష్కరించిందని మోదీ అన్నారు. కాగా, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్‌... కార్గిల్‌ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగాలు వృథా కాబోవన్నారు. కాగా, పార్లమెంటులో సభ్యులు కార్గిల్‌ అమరవీరుల కోసం మౌనం పాటించారు. వారి మహోన్నత త్యాగాలకు దేశం రుణపడి ఉంటుందని రాహుల్‌గాంధీ అన్నారు.

అగ్ని వీరులకు ఉద్యోగాలు

ప్రధాని మోదీ అభిలాష మేరకు అగ్నివీరులుగా పనిచేసి వచ్చిన వారికి పోలీసు, ప్రాదేశిక సైనిక దళాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తాజాగా బీజేపీ పాలిత ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు ప్రకటించాయి. ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా సైతం అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయి. హరియాణా ఇదివరకే ఈ తరహా ప్రకటన చేసింది.

అగ్నిపథ్‌.. గొప్ప సంస్కరణ

అగ్నిపథ్‌ పథకంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి మోదీ తిప్పికొట్టారు. జవాన్లను యుద్ధ సన్నద్ధులను చేయడానికి ఈ పథకం ఎంతగానో తోడ్పడిందన్నారు. యువసేనగా ఆర్మీని మార్చాలని దశాబ్దాలుగా పార్లమెంటులో, వివిధ కమిటీల్లో జరుగుతున్న చర్చలు అగ్నిపథ్‌ రూపంలో సాకారం అయ్యాయన్నారు.

ఆర్మీలో సేవలు అందిస్తున్న జవాను వయసు ప్రపంచవ్యాప్త వయోసగటుతో పోల్చితే భారత్‌లోనే నిన్నటివరకు అధికంగా ఉండేదని గుర్తు చేశారు. ఎంతగానో బాధిస్తున్న ఈ సమస్యను గుర్తించి, దానిపై ముఖ్యమైన సంస్కరణను సైన్యం చేపట్టిందన్నారు.

అయినా, జాతీయ భద్రతతో ముడిపడిన ఇటువంటి సున్నితమైన అంశంపైనా కొందరు రాజకీయం చేస్తున్నారని, స్వప్రయోజన కాంక్షతో అబద్ధాలు వల్లిస్తున్నారని మోదీ మండిపడ్డారు. కాగా, అగ్నిపథ్‌పై మోదీ వ్యాఖ్యలను విపక్షాలు తప్పుబట్టారు.

కార్గిల్‌ విజయ దివస్‌ నాడు కూడా మోదీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. ఆర్మీ కోరితేనే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని అమలు చేస్తోందన్న రీతిలో మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని, ఇది పచ్చి అబద్ధమన్నారు.

శౌర్య జవానులకిది మరిచిపోలేని అవమానమని మండిడ్డారు. ఈ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌ను సైన్యానికి తెలియకుండా హఠాత్తుగా కేంద్రం ప్రవేశపెట్టిందని కాంగ్రె్‌సకు చెందిన మరో నేత జైరామ్‌ రమేశ్‌ విమర్శించారు. ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఈ పథకాన్ని ఏకపక్షంగా తెచ్చారని అదే పార్టీకి చెందిన ఎంపీ వివేక్‌ టంఖా అన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 05:03 AM