Priyanka Gandhi: రాహుల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీపై మండిపడిన ప్రియాంక గాంధీ
ABN , Publish Date - Sep 20 , 2024 | 03:30 PM
లోక్ సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Rahul Gandhi) బీజేపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీకి రెండు రోజుల క్రితం లేఖ రాసిన విషయం విదితమే.
ఢిల్లీ: లోక్ సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Rahul Gandhi) బీజేపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీకి రెండు రోజుల క్రితం లేఖ రాసిన విషయం విదితమే. ఆ లేఖపై గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంకో లేఖ రాశారు. అందులో రాహుల్‌ను విఫల నాయకుడిగా పేర్కొన్నారు. త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిని హైలెట్ చేయాలని ప్రయత్నిస్తోందని నడ్డా ఆక్షేపించారు.
యువరాజు ఒత్తిడితో కాంగ్రెస్ ‘కాపీ ఫేస్ట్’ పార్టీగా మారిందంటూ ఖర్గేకు రాసిన లేఖలో జేపీ నడ్డా పేర్కొన్నారు. "ఖర్గే లేఖలో రాహుల్ సహా మీ నాయకుల అకృత్యాలను ఉద్దేశపూర్వకంగా మరిచిపోయినట్లు అనిపిస్తుంది. ఆ విషయాలను మీ దృష్టికి వివరంగా తీసుకురావాలని భావించా.. దేశంలోని పురాతన రాజకీయ పార్టీ ప్రస్తుతం యువరాజు రాహుల్ గాంధీ ఒత్తిడితో కాపీ పేస్ట్ పార్టీగా మారిపోవటం బాధాకరం"అని నడ్డా పేర్కొన్నారు.
చౌకబారు రాజకీయాలు..
ఈ లేఖపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. "ప్రధాని మోదీకి ఖర్గే లేఖ రాశారు. ప్రధానికి ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం, పెద్దల పట్ల గౌరవం ఉంటే ఈ లేఖకు ఆయనే స్వయంగా సమాధానం ఇచ్చేవారు. బదులుగా ఆయన జేపీ నడ్డా ద్వారా చౌకబారు ప్రత్యుత్తరం రాసి పంపారు. 82 ఏళ్ల సీనియర్ నేతను అగౌరవపర్చాల్సిన అవసరం ఏముంది.
ప్రశ్నలు అడగడం, మాట్లాడటం ప్రజాస్వామ్యం సంప్రదాయం. సమాజంలో కూడా గౌరవం, మర్యాద వంటి విలువలకు ఎవరూ అతీతులు కాదు. ఖర్గే లేఖకు స్వయంగా సమాధానం ఇచ్చిఉంటే మోదీకి గౌరవంగా ఉండేది. ప్రజల దృష్టిలో ఆయన గౌరవం మరింత పెరిగేది. ప్రభుత్వంలో అత్యున్నత పదవుల్లో ఉన్న నాయకులు ఇలాంటి సంప్రదాయాలను తిరస్కరించడం విచారకరం" అని ప్రియాంక మండిపడ్డారు.
Read MoreNational News and Latest Telugu News