బిలియనీర్ల పెళ్లిళ్లకు వేల కోట్లు... పేదలకేమో అప్పులు!
ABN , Publish Date - Oct 02 , 2024 | 03:51 AM
పాతికమంది పారిశ్రామికవేత్తల కోసం మోదీ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. భారత్‌లో కేవలం ఓ 25 మంది తమ ఇంట పెళ్లిళ్లకు వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారని, అదే సమయంలో రైతులు, సామాన్య ప్రజలు మాత్రం తమ పిల్లల పెళ్లిళ్ల కోసం అప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
అంబానీ కొడుకు పెళ్లికి ఖర్చు చేసిన డబ్బంతా పేదల సొమ్మే
హరియాణా ప్రచారంలో రాహుల్
న్యూఢిల్లీ, అక్టోబరు 1: పాతికమంది పారిశ్రామికవేత్తల కోసం మోదీ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. భారత్‌లో కేవలం ఓ 25 మంది తమ ఇంట పెళ్లిళ్లకు వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారని, అదే సమయంలో రైతులు, సామాన్య ప్రజలు మాత్రం తమ పిల్లల పెళ్లిళ్ల కోసం అప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంపిక చేసిన కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్న మోదీ ప్రభుత్వ తీరు రాజ్యాంగ ఉల్లంఘన కాక మరేమిటని రాహుల్ ప్రశ్నించారు.
దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ తన కుమారుడి వివాహం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అది ఈ దేశ ప్రజల సొత్తు అని రాహుల్ అన్నారు. హరియాణాలోని బహదూర్‌గఢ్‌లో ఎన్నికల సభలో రాహుల్ మంగళవారం ప్రసంగించారు. ఈ నెల 5న పోలింగ్ జరగనున్న హరియాణాలో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ, పదేళ్ల తర్వాతైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతున్నాయి. కాగా, హిందుత్వ సిద్ధాంతకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యాలు చేశారంటూ దాఖలైన పరువు నష్టం దావాలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు జారీ చేసింది. స్వయంగాగానీ, న్యాయవాదిని పంపించడం ద్వారాగానీ విచారణకు హాజరు కావాలని నాసిక్ అదనపు చీఫ్ జ్యుడిషీయల్ మేజిస్ట్రేటు దీపాలీ పరిమల్ కదూస్కర్ సమన్లు పంపించారు.