Share News

Diwali 2024: వారితో రాహుల్ గాంధీ దీపావళి సెలబ్రేషన్స్.. వీడియో చూశారా..

ABN , Publish Date - Nov 01 , 2024 | 06:24 PM

లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పలు రంగాలకు చెందిన కళాకారులతో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ సామాజిక మాద్యమాల్లో పంచుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు ఆయన మేనల్లుడు రేహాన్ వాద్రా కళాకారులతో..

Diwali 2024: వారితో రాహుల్ గాంధీ దీపావళి సెలబ్రేషన్స్.. వీడియో చూశారా..
Rahul Gandhi

దీపావళి అంటే భారత్‌లో ఓ ప్రత్యేకమైన పండుగ. చిన్నా, పెద్దా కలిసి ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు దీపావళి సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు సైనిక బలగాలతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకోగా.. లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పలు రంగాలకు చెందిన కళాకారులతో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ సామాజిక మాద్యమాల్లో పంచుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు ఆయన మేనల్లుడు రేహాన్ వాద్రా కళాకారులతో కలిసి దీపావళి పండుగను నిర్వహించుకున్నారు. కళాకారులతో కలిసి ప్రమిదలు, కుండలు తయారుచేశారు. అంతేకాదు కొందరు పెయింటింగ్ కళాకారుల నివాసానికి రంగులు వేసి పెయింటిం‌లో మెళకువలు తెలుసుకున్నట్లు రాహుల్ గాంధీ తన వీడియోలో తెలిపారు. రాహుల్ గాంధీ దీపావళి వేడుకల్లో పాల్గొన్న వీడియోను షేర్ చేస్తూ భారతదేశాన్ని ప్రకాశవంతం చేసే వారితో దీపావళి అంటూ రాసుకొచ్చారు. రాహుల్‌తో పాటు మేనల్లుడు రేహాన్ కూడా పెయింట్ వేశారు. పెయింటింగ్ కళాకారులతో కలిసి రాహుల్ గాంధీ టీ తాగారు. అదే సమయంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులు రాహుల్ గాంధీతో చెప్పుకున్న సమస్యలు వీడియోలో ఉన్నాయి.

Rahul Gandhi.jpg


రాహుల్ సందేశం..

కళాకారులు తయారుచేసే మట్టి ప్రమిదలు ఎప్పటికైనా ప్రపంచంలోని విలువైన సెరామిక్‌తో చేసిన వస్తువులతో పోటీపడవచ్చని రాహుల్ గాంధీ తన మేనల్లుడు రేహాన్‌కు చెప్పారు. దీపావళి పండుగ విశిష్టత, దేశంలో సామాన్య ప్రజల ఇబ్బందుల గురించి రాహుల్ గాంధీ తన వీడియోలో పేర్కొన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను వివరించారు. ప్రమిదలు తయారుచేసే కార్మికులు ప్రతి ఒక్కరి దీపావళి సంతోషకరమైనదిగా చేస్తారన్నారు. దీపావళి పండుగ వీరందరి జీవితాల్లో శ్రేయస్సు, పురోగతి, అభివృద్ధిని తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Rahul Gandhi1.jpg


ఇటీవల కాలంలో..

రాహుల్ గాంధీ తరచూ వివిధ రంగాలకు సంబంధించిన కార్మికులు, రోజువారీ కూలీలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుని, ఎక్స్‌లో పోస్టుచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇలాంటి దృశ్యాలు ఎన్నో కనిపించేవి. తాజాగా ఢిల్లీలో ఓ సాధారణ సెలూన్‌ షాపులో గడ్డం గీయించుకున్న రాహుల్, బార్బర్ సమస్యలను అడిగితెలుసుకుని, దానికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. తాజాగా దీపావళి వేడుకలను పలు రంగాలకు చెందిన కళాకారులతో కలిసి జరుపుకున్న వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 01 , 2024 | 06:40 PM