Share News

Rahul Gandhi : బహుజన హక్కులు కాపాడతాం

ABN , Publish Date - Oct 08 , 2024 | 04:34 AM

భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ పార్టీ పరిరక్షిస్తుందని, రాజ్యాంగం ద్వారా బహుజనులకు లభించిన హక్కులను కాపాడుతుందని ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ఉద్ఘాటించారు.

Rahul Gandhi : బహుజన హక్కులు కాపాడతాం

  • ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఉన్నప్పుడే అందరికీ సమాన హక్కులు : రాహుల్‌

  • దళిత కుటుంబంతో కలిసి వంట చేసిన వీడియోను పంచుకున్న నేత

న్యూఢిల్లీ, అక్టోబరు 7: భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ పార్టీ పరిరక్షిస్తుందని, రాజ్యాంగం ద్వారా బహుజనులకు లభించిన హక్కులను కాపాడుతుందని ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ఉద్ఘాటించారు. అయితే, సమాజంలోని ప్రతి ఒక్కరూ సోదరభావ స్ఫూర్తితో మెలిగినప్పుడే రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, హక్కులు ప్రతి ఒక్కరికీ లభిస్తాయని తెలిపారు. రాహుల్‌గాంధీ ఇటీవల దళిత కుటుంబంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి వంట చేశారు.

ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సోమవారం సోషల్‌ మీడియాలో ఆయన వీడియోను పంచుకున్నారు. ‘‘దళితుల వంటిల్లు ఎలా ఉంటుందనేది ఇప్పటికీ చాలా తక్కువ మందికే తెలుసు. దళితులు ఏం తింటారో ఎవరికీ తెలియదు. అసలు వారేం తింటారో? ఏం వండుకుంటారో? సామాజిక, రాజకీయ కోణంలో చూసినప్పుడు చాలా ఆసక్తిగా ఉంది. ఒక రోజు మధ్యాహ్నం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న అజయ్‌ తుకారాం సనాదే, అంజనా తుకారాం సనాదేలతో గడిపాను. ఆ సమయంలో వారుచేస్తున్న వంటలో సాయం చేశాను. అందరం కలిసి శనగలతో కూర చేశాం.

వంకాయ, ఆకుకూరలతో పప్పు చేశాం’’ అని రాహుల్‌ తన వీడియోలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబంతో అనేక విషయాలు పంచుకున్నానని తెలిపారు. అంజనా తుకారం కుటుంబం చెప్పిన దానిని బట్టి వారు ఇప్పటికీ కుల, సామాజిక వివక్షకు గురవుతూనే ఉన్నారని తెలిసిందన్నారు. కాగా, ఈ వీడియోలో దళిత కుటుంబంతో కలిసి రాహుల్‌ గాంధీ వంట చేయడంతోపాటు, వారితో కలిసి భోజనం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి.

Updated Date - Oct 08 , 2024 | 04:34 AM