Rahul Gandhi: అంబానీ, అదానీలపైకి సీబీఐ, ఈడీని పంపండి!
ABN , Publish Date - May 09 , 2024 | 03:37 AM
కాంగ్రెస్ పార్టీకి అంబానీ, అదానీల నుంచి డబ్బులు అందాయని, అందుకే వారి పేర్లు ఎత్తడం మానేసిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు రాహుల్‌గాంధీ అంతే స్థాయిలో బదులిచ్చారు.
వారు డబ్బులు టెంపోల్లో పంపుతారన్నది.. మీ స్వీయానుభవమా మోదీజీ?: రాహుల్
న్యూఢిల్లీ, మే 8: కాంగ్రెస్ పార్టీకి అంబానీ, అదానీల నుంచి డబ్బులు అందాయని, అందుకే వారి పేర్లు ఎత్తడం మానేసిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు రాహుల్‌గాంధీ అంతే స్థాయిలో బదులిచ్చారు. ఆ ఇద్దరు వ్యాపారవేత్తలపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని ప్రధానికి సూచించారు. ఈ మేరకు రాహుల్ బుధవారం ఓ వీడియో మెసేజ్‌ను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘మోదీజీ.. భయపడ్డారా? అంబానీ, అదానీల గురించి సాధారణంగా మీరు గడియ వేసుకొని మాట్లాడతారు.
మొట్టమొదటిసారి వారి గురించి బహిరంగంగా మాట్లాడారు. వారు వాహనాల్లో (టెంపోల్లో) డబ్బు పంపిస్తారని కూడా మీకు తెలుసునన్నమాట! ఇది మీ స్వీయానుభవమా?’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. వారిద్దరికి భయపడకుండా సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని సూచించారు. ఆ వ్యాపారవేత్తలకు మోదీ ఇచ్చే డబ్బును.. కాంగ్రెస్ పార్టీ వివిధ పథకాల ద్వారా దేశంలోని పేదలకు ఇస్తుందన్నారు.
బీజేపీ 22 మంది కోటీశ్వరులను చేస్తే.. తాము కోట్ల మందిని కోటీశ్వరులను చేస్తామన్నారు. మరోవైపు మోదీకి ఓటమి కళ్లముందు కనిపిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. దీంతో మోదీ తన నీడను చూసుకుని కూడా భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ నీడతో కూడిన ఫొటోను ‘ఎక్స్’లో జైరాం పోస్ట్ చేశారు.