Share News

Rahul Gandhi Birthday: అనుమానాల నుంచి నమ్మకం వరకు.. స్ఫూర్తిదాయకం.. రాహుల్ రాజకీయ ప్రయాణం

ABN , Publish Date - Jun 19 , 2024 | 11:42 AM

రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్ర తరువాత ఈ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. గాంధీ వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. తనదైన మార్క్‌తో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు.

Rahul Gandhi Birthday: అనుమానాల నుంచి నమ్మకం వరకు.. స్ఫూర్తిదాయకం.. రాహుల్ రాజకీయ ప్రయాణం

ఢిల్లీ: రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్ర తరువాత దేశ వ్యాప్తంగా మార్మోగిపోయిన పేరు ఇది. గాంధీ కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. తనదైన మార్క్‌తో దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అత్యంత బలీయ శక్తిగా ఉన్న బీజేపీని సమర్థంగా నిలువరించడంలో రాహుల్ చాలా వరకు సక్సెస్ అయ్యారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సర్వే సంస్థలు కూడా అంచనా వేయని రీతిలో ఇండియా కూటమి(INDIA Alliance) గణనీయ సంఖ్యలో సీట్లు సాధించడం వెనుక రాహుల్ శ్రమ, వ్యూహాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీలకు 1970, జూన్ 19న రాహుల్ జన్మించారు(Rahul Gandhi Birthday). బుధవారం ఆయన 54వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాహుల్ రాజకీయ ప్రయాణాన్ని మరోసారి గమనిద్దాం..

బాల్యం..

జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వంటి రాజకీయ ఉద్దండులు ఉన్న కుటుంబంలో రాహుల్ జన్మించారు. ఆయన ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో ప్రాథమిక విద్యనభ్యసించారు. తరువాత ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీలో ఎంఫిల్ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.

రాజకీయ ప్రవేశం

2004లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలుపొంది.. రాహుల్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఈ స్థానం గాంధీ కుటుంబానికి కంచుకోట.


సవాళ్లు, విమర్శలు

ప్రముఖ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ ఆయన రాజకీయాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. విమర్శకులు రాహుల్‌ని అనుభవం లేని వ్యక్తిగా, రాజకీయాలు తెలియని నేతగా ముద్రించారు. కానీ రాహుల్ ఏ దశలోనూ వెనకడుగు వేయలేదు. బీజేపీ విమర్శలను ధీటుగా ఎదుర్కొన్నారు. ఆ తరువాత తనను తాను నిరూపించుకోవడానికి రాహుల్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు.

కాంగ్రెస్ పార్టీలో ఎదుగుదల

2007లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI), యూత్ కాంగ్రెస్‌లను ఉత్తేజపరచడంపై దృష్టి సారించారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు కృషి చేశారు.

ఆ ఎన్నికలపై ప్రభావం

2009 లోక్ సభ ఎన్నికలు రాహుల్ గాంధీకి కీలకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన చేసిన ప్రచారం ఆ పార్టీ విజయానికి దోహదపడింది. అలా యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది.


నాయకత్వ సవాళ్లు

2014, 2019 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత రాహుల్ నాయకత్వంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ, ప్రధాని మోదీ నాయకత్వానికి పెరుగుతున్న ప్రజాదరణను సమర్థంగా ఎదుర్కోలేకపోయారని రాహుల్‌పై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పించారు.

ఓడి.. గెలిచాడు..

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, రాహుల్ గాంధీ వ్యవహారశైలిలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్రలు యువత, నిరుపేదలు, రైతుల్లో రాహుల్‌పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్‌ రెండింటిలో రాహుల్ ఘన విజయం సాధించి తన సత్తా చాటారు. దీనికితోడు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించాలని, ఓట్లు చీలి బీజేపీకి లాభం జరగకూడదనే ఆలోచనతో.. విపక్షాలన్నింటినీ రాహుల్ ఏకతాటిపైకి తెచ్చారు.

దీంతో ఇండియా కూటమి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గట్టి షాక్‌నిచ్చింది. చివరికి బీజేపీ రెండు ప్రాంతీయ పార్టీల సహకారంతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలన్నీ రాహుల్‌లోని నాయకత్వ లక్షణాలను బయట పెట్టాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ సరికొత్త జోష్ నింపారు. ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణంగా తన మార్క్ రాజకీయాలను చూపించడం ఖాయమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jun 19 , 2024 | 12:14 PM