Share News

PM Modi: నాడు రాజీవ్‌ గాంధీలాగా.. నేడు మోదీ వదులుకుంటారా?

ABN , Publish Date - Jun 07 , 2024 | 05:13 PM

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధిస్తుందని.. తమ బీజేపీనే 370 సీట్లను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ..

PM Modi: నాడు రాజీవ్‌ గాంధీలాగా.. నేడు మోదీ వదులుకుంటారా?
Sachin Pilot On Why Narendra Modi Should Not Govt

2024 లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Polls 2024) ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధిస్తుందని.. తమ బీజేపీనే 370 సీట్లను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ.. ఎన్నికల ఫలితాలు అందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి. బీజేపీ కేవలం 240 సీట్లకే పరిమితం అయ్యింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ(272)కి 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో.. ఎన్డీఏలోని మిత్రపక్షాల సహకారంతో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1989 సంఘటనని గుర్తు చేస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుకి నరేంద్ర మోదీ ప్రయత్నించకూడదని సూచించారు.


కండక్టర్ కాదు.. స్పైడర్‌మ్యాన్.. ప్రయాణికుడ్ని ఎలా కాపాడాడో చూడండి

‘‘2024 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. 1989లో ఎన్నికలు జరిగినప్పుడు.. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి సుమారు 200 సీట్లు వచ్చాయి. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయమని రాజీవ్‌ని కోరగా.. ఆయన తిరస్కరించారు. ఎందుకని ప్రశ్నిస్తే.. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మెజారిటీ తమ పార్టీకి రాలేదని, ప్రజాతీర్పు అనుకూలంగా లేదని కారణాలు తెలిపారు. దాంతో.. కాంగ్రెస్ తర్వాత అత్యధిక సీట్లు సాధించిన పెద్ద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా పిలుపువచ్చింది’’ అని సచిన్ పైలట్ పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ప్రజలు తిరస్కరించారని ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయని.. కాబట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని సవాల్ ఉద్ఘాటించారు.


ఇంట్రెస్టింగ్ సీన్.. మోదీ పాదాలను నితీశ్ టచ్ చేయబోతే..

మందిర్-మసీదు, హిందూ-ముస్లిం, మంగళసూత్రం అంటూ బీజేపీ చేసిన ఎన్నికల ప్రచారాన్ని దేశ ప్రజలు అంగీకరించలేదని సచిన్ పైలట్ తెలిపారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం, ముఖ్యమంత్రులను జైల్లో పెట్టడం, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం వంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం అవలంభించిందని ఆరోపించారు. ఈ చర్యలన్నింటినీ ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో డబుల్ ఇంజిన్ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు. ఈసారి తమ కాంగ్రెస్ పార్టీ సీట్ల సంఖ్య రెట్టింపు అయ్యిందని.. తమ మేనిఫెస్టోని, ప్రచారాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారని వెల్లడించారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ కార్యకర్థలు, నాయకులు, అభ్యర్థులకు సచిన్ పైలట్ ధన్యవాదాలు తెలిపారు.


1989 సీన్

1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 197 స్థానాలను కైవసం చేసుకుంది. అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మాత్రం ఆ పార్టీకి దక్కలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తర్వాత జనతాదళ్ పార్టీ 143 స్థానాలను దక్కించుకుంది. రాజీవ్ గాంధీ వెనకడుగు వేయడంతో.. ఆ సమయంలో జేడీ పార్టీ అధ్యక్షుడు వీపీ సింగ్ ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఆయన ప్రధానిగా 11 నెలలు మాత్రమే కొనసాగారు. 1989 డిసెంబర్ 2వ తేదీన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన వీపీ సింగ్.. 1990 నవంబర్ 10వ తేదీన దిగిపోయారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 05:27 PM