Supreme Court: రిజర్వేషన్లపై నితీష్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ABN , Publish Date - Jul 29 , 2024 | 08:56 PM
రిజర్వేషన్ల అంశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంశంపై పాట్నా హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు నిరాకరించింది.
న్యూఢిల్లీ: రిజర్వేషన్ల అంశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంశంపై పాట్నా హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు నిరాకరించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా పెంపును పాట్నా హైకోర్టు ఇంతకుముందే తోసిపుచ్చగా, దానిని బీహార్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం తాజాగా స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సమగ్ర విచారణ కోసం సెప్టెంబర్‌కు కేసును వాయిదా వేసింది. న్యాయమూర్తులు జేపీ పరిడివాలా, మనోజ్‌మూర్తి సుప్రీం ధర్మాసనంలో ఉన్నారు.
Delhi Excise policy case: కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ అభ్యర్థనపై హైకోర్టు తీర్పు రిజర్వ్
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ రెండు చట్టాలను బీహార్ అసెంబ్లీ 2023లో సవరించింది. రాష్ట్రంలో కులగణన ఆధారంగా ఎస్‌సీల కోటాను 20 శాతానికి, ఎస్టీల కోటాను 2 శాతానికి, ఈబీసీల కోటాను 25 శాతానికి, వెనుకబడిన తరగతుల కోటాను 18 శాతానికి పెంచింది. ఆ సమయంలో నితీష్ కుమార్ 'మహా ఘట్ బంధన్' ప్రభుత్వంలో ఉన్నారు. బీహార్ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, జూన్ 20 ధర్మాసనం 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. దీనిపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును బీహార్ సర్కార్ ఆశ్రయించింది.
Read Latest National News and Telugu News