Share News

వీధి కుక్కలకు బిస్కెట్లు వేసి.. ఉగ్రవాదిని హతమార్చి

ABN , Publish Date - Nov 04 , 2024 | 03:44 AM

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో భారత బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి.

వీధి కుక్కలకు బిస్కెట్లు వేసి.. ఉగ్రవాదిని హతమార్చి

  • ఉగ్రకమాండర్‌ ఉస్మాన్‌ను వ్యూహాత్మకంగా మట్టుబెట్టిన సైన్యం

  • శ్రీనగర్‌లో ఉగ్రవాదుల గ్రెనేడ్‌ దాడి..12 మందికి గాయాలు

శ్రీనగర్‌, నవంబరు 3: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో భారత బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. శనివారం లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రకమాండర్‌ ఉస్మాన్‌ను మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్‌లో బిస్కెట్లది కీలక పాత్ర అని అధికారులు తెలిపారు. అనంత్‌నాగ్‌ జిల్లా ఖాన్యార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో శనివారం తెల్లవారుజామున బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో సైనికులకు వీధికుక్కల రూపంలో సవాల్‌ ఎదురైంది. అవి మొరిగితే ఉస్మాన్‌ తప్పించుకునే అవకాశం ఉంది. దీంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన జవాన్లు అవి అరవకుండా ఉండడానికి దారిపొడవునా శునకాలకు బిస్కెట్లు అందిస్తూ వచ్చారు. ఈ వ్యూహంతో ఆపరేషన్‌ వియవంతమైందని, ఇలాంటి సమయాల్లో వీధికుక్కల సమస్యకు పరిష్కారం దొరికిందని సీనియర్‌ అధికారులు తెలిపారు. మరోవైపు, ఆదివారం శ్రీనగర్‌లోని ఆల్‌ఇండియా రేడియో సమీపంలోని టూరిస్టు రిసెప్షన్‌ సెంటర్‌ దగ్గరలో గల మార్కెట్‌ వద్ద ఉగ్రవాదులు గ్రెనేడ్‌ విసిరారు. రద్దీగా ఉండే వార సంతలో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కనీసం 12 మంది గాయపడ్డారు.

Updated Date - Nov 04 , 2024 | 03:44 AM