Supreme Court : అన్నీ కుదరదు
ABN , Publish Date - Nov 06 , 2024 | 03:10 AM
ప్రభుత్వం ప్రైవేటు ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న అన్ని ఆస్తులనూ ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.
ప్రైవేటు ఆస్తులన్నింటిపై ప్రభుత్వానికి హక్కు లేదు!
సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఉమ్మడి ప్రయోజనాల కోసమంటూ
స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు
8:1 మెజారిటీతో తీర్పు ఇచ్చిన ధర్మాసనం
వ్యతిరేక తీర్పు ఇచ్చిన జస్టిస్ ధులియా
రాజ్యాంగం ఆర్టికల్ 39ని వివరించడంలో గత న్యాయమూర్తులు విఫలం
1977 నాటి కేసులో జస్టిస్ అయ్యర్ వ్యాఖ్యానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: సీజేఐ
అయ్యర్‌పై సీజేఐ వ్యాఖ్యలు అవాంఛనీయం
అప్పటి పరిస్థితులకు తగ్గట్లు ఆయన తీర్పు
తన తీర్పులో జస్టిస్ నాగరత్న వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, నవంబరు 5: ప్రభుత్వం ప్రైవేటు ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న అన్ని ఆస్తులనూ ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం 8:1 మెజారిటీతో ఈ మేరకు తీర్పు ఇచ్చింది. గతంలో దేశంలో సర్వం ప్రభుత్వం కింద ఉండాలనే ఆర్థిక పిడివాదాలు ఉండేవని ధర్మాసనం పేర్కొంది. కానీ, దేశ ఆర్థిక వ్యవస్థ చాలా పరివర్తన చెందిందని, ఆ తరహా సిద్ధాంతం ఇప్పటి కాలానికి సరిపోదని వ్యాఖ్యానించింది. 1977లో రంగనాథరెడ్డి వర్సెస్ కర్ణాటక కేసులో ఆర్టికల్ 39(బి) ప్రకారం ప్రైవేటు యాజమాన్యంలోని ఆస్తులన్నీ సామాజిక ఆస్తుల కింద సేకరించే అధికారం ప్రభుత్వాలకు లేదంటూ 4:3 మెజారిటీతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
అయితే నాటి ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ మాత్రం వ్యతిరేక తీర్పు ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులన్నింటినీ ప్రజల సంక్షేమం, ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని చెప్పారు. అయితే 1982, 1997ల్లో సంజీవ్ కోక్, మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ కేసులను విచారించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనాలు జస్టిస్ అయ్యర్ అభిప్రాయాలపై ఆధారపడి తీర్పులు ఇచ్చాయి.
ఈ నేపథ్యంలో అన్ని ప్రైవేటు ఆస్తులను ఉమ్మడి ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందా? అనే అంశంపై 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. తాజా ధర్మాసనంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌తో పాటు న్యాయమూర్తులు హృషికేశ్‌రాయ్, బీవీ నాగరత్న, సుధాన్షు ధులియా, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా, రాజేశ్ బిందాల్, సతీశ్‌చంద్ర శర్మ, ఏజీ మాసి్‌హలు ఉన్నారు. జస్టిస్ సుధాన్షు ధులియా మాత్రం ఈ తీర్పును వ్యతిరేకించారు. జస్టిస్ బీవీ నాగరత్న మెజారిటీ సభ్యుల తీర్పును పాక్షికంగా వ్యతిరేకించారు. అదేసయంలో జస్టిస్ కృష్ణ అయ్యర్‌పై సీజేఐ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జస్టిస్ ధులియా కూడా సీజేఐ వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ప్రకారం.. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించవచ్చా? అన్న కీలక కేసుపై కొద్ది నెలల క్రితం సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే.. ఈ రెండూ విధానాలూ పరస్పరం భిన్నమైనవి. వీటిపై ప్రస్తుత పరిస్థితులు, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమకాలీన వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఉంది’’ అని అభిప్రాయపడింది. ‘‘1950ల్లో భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వ్యాఖ్యానం చేయకూడదు. అప్పుడు ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటు జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా న్యాయస్థానం వ్యాఖ్యలు ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. తాజాగా ఈ వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసు ఆర్టికల్ 31(సి)కి సంబంధించినదని.. ప్రభుత్వ విధానాల అమలు కోసం చేసే చట్టాలకు ఇది రక్షణ కల్పిస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఆర్టికల్ 31(సి) రక్షణ పరిధిలోకి ఆర్టికల్ 39(బి) కూడా వస్తుందని తెలిపింది. సామాజిక ఆస్తులను ఉమ్మడి ప్రయోజనాల కోసం అత్యుత్తమ రీతిలో వినియోగించేలా ప్రభుత్వం తన విధానాలను రూపకల్పన చేయాలని ఆర్టికల్ 39(బి) నిర్దేశిస్తోంది. అయితే ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్నట్లుగా సామాజిక ఆస్తులంటే ప్రైవేటు యాజమాన్యంలోనివి కూడానా? అంటే.. సిద్ధాంతపరంగా అవుననే సమాధానమే వస్తుందని సీజేఐ పేర్కొన్నారు. కానీ, ఈ విషయాన్ని వివరించడంలో జస్టిస్ అయ్యర్ విఫలమయ్యారన్నారు. ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని చెప్పే మొండి ఆర్థిక సిద్ధాంతమే రాజ్యాంగబద్ధ ప్రభుత్వానికి ఆధారమని జస్టిస్ కృష్ణ అయ్యర్ పేర్కొనడం సరికాదని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ఆయన సిద్ధాంతం రాజ్యాంగ విశాల స్ఫూర్తికి విరుద్ధం, హానికరమని వ్యాఖ్యానించారు.
వ్యక్తులకు చెందిన ప్రతి ఆస్తినీ సామాజిక ఆస్తిగా పరిగణించకూడదని.. ప్రజాప్రయోజనాలకు అవసరమైన దాన్ని మాత్రమే సేకరించాలని స్పష్టం చేశారు. ఆర్టికల్ 39(బి)ని పరిస్థితులకు అనుగుణంగా వినియోగించుకోవాలన్నారు. తమ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్రకు చెందిన ప్రాపర్టీస్ ఓనర్స్ అసోసియేషన్(పీవోఏ) 1992లో పిటిషన్ దాఖలు చేసింది.
సీజేఐ వ్యాఖ్యలు అవాంఛనీయం
ప్రైవేటు ఆస్తుల విషయంలో సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పుతో జస్టిస్ బీవీ నాగరత్న పాక్షికంగా విభేదించారు. అయితే జస్టిస్ అయ్యర్‌పై సీజేఐ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఈ మేరకు ఆమె విడిగా రాసిన 130 పేజీల తీర్పులో పలు వ్యాఖ్యలు చేశారు. నాటి(1977లో) పరిస్థితులకు అనుగుణంగా జస్టిస్ అయ్యర్ ప్రభుత్వ విధానాలకు విస్తృత ప్రాధాన్యమిచ్చి, ప్రైవేటు ఆస్తుల సేకరణపై ప్రభుత్వానికి హక్కు ఉంటుందని తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన మానవతావాది అని, క్రిమినల్ జస్టి్‌సలో చేపట్టిన సంస్కరణలు ఎనలేనివని తెలిపారు. ‘బెయిల్ అనేది నిబంధన.. జైలు అనేది మినహాయింపు’ అనేది జస్టిస్ అయ్యర్ చేసిన వ్యాఖ్య అని.. దాన్ని ఇప్పటికీ సుప్రీంకోర్టు జడ్జిలు అనుసరిస్తున్నారని గుర్తుచేశారు. ఆయన ఆర్థిక సిద్ధాంతం రాజ్యాంగ విశాల స్ఫూర్తికి హానికరమన్న సీజేఐ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలు 1991 నుంచి మారినంత మాత్రాన అంతకుముందున్న సుప్రీం జడ్జిలు రాజ్యాంగ స్ఫూర్తికి హాని కలిగించారని నిందించడం సరికాదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.