గురుద్వారా, దర్గా, గుడి.. రోడ్లపై ఏది ఉన్నా.. తొలగించాల్సిందే!
ABN , Publish Date - Oct 02 , 2024 | 03:02 AM
రహదారులు, జలాశయాలు, రైల్వే ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ప్రజాప్రయోజనం, భద్రతే ముఖ్యం
ఆక్రమణల తొలగింపునకు మతాలతో సంబంధం లేదు
దేశమంతటా వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేస్తాం
‘బుల్డోజర్ కూల్చివేతల’పై విచారణలో సుప్రీంకోర్టు
తీర్పు రిజర్వు.. అప్పటి వరకు కూల్చొద్దని ఆదేశం
మనది సెక్యులర్ దేశం. జాతి, మతంతో సంబంధం లేదు. అక్రమ నిర్మాణాల విషయంలో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది.
- సుప్రీంకోర్టు ధర్మాసనం
న్యూఢిల్లీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రహదారులు, జలాశయాలు, రైల్వే ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రయోజనం, వారు సురక్షితంగా ఉండడడమే అత్యంత ప్రధాన అంశమని తేల్చి చెప్పింది. రోడ్డు మధ్యలో గురుద్వారా లేదా దర్గా లేదా గుడి.. ఏది నిర్మించినా ఉపేక్షించరాదని.. అవి ప్రజలకు ప్రతిబంధకంగా మారరాదని పేర్కొంది. మతంతో నిమిత్తం లేకుండా దురాక్రమణలను తొలగించే చర్యలు ప్రజలందరికీ వర్తింపజేయాలంది.
అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి దేశమంతటా వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. భారత్ సెక్యులర్ దేశమని, ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్‌తో చర్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒక్కటేనని ధర్మాసనం పేర్కొంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు.
వాదనల సందర్భంగా ‘ఏదైనా క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉండడమే బుల్డోజర్ చర్యలకు ఆధారమా?’ అని ధర్మాసనం మెహతాను ప్రశ్నించింది. స్పందించిన మెహతా.. ‘‘కచ్చితంగా కాదు. అత్యాచారం, ఉగ్రవాదం వంటి ఘోరమైన నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు. ఒక్కరోజు ముందు నోటీసు ఇంటి గోడపై అంటించినా పరిగణనలోకి తీసుకోం. ఆక్రమణలు గతంలోనే జరిగి ఉంటేనే చర్యలు తీసుకొంటాం’’ అని బదులిచ్చారు. ఒకే మతం వారిని లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆరోపణలతో కోర్టు ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా ఉందని తాను ఆందోళన చెందుతున్నట్లు తుషార్ మెహతా పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం.. ‘‘మనది సెక్యులర్ దేశం. మేం జారీ చేసిన మార్గదర్శకాలు అందరికీ వర్తిస్తాయి.
జాతి, మతంతో సంబంధం లేదు. ఆక్రమణల విషయానికి వస్తే మేం ఇప్పటికే స్పష్టంగా చెప్పాం. గురుద్వారా లేదా దర్గా లేదా గుడి ఏదైనా, ఏ మతపరమైన ప్రార్థనా మందిరమైనా రోడ్లు, ఫుట్‌పాత్‌లు, జలాశయాలు, రైల్వే ట్రాక్‌లు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు వంటి వాటిలో ఉంటే కచ్చితంగా తొలగించాల్సిందే. అవన్నీ ప్రజలకు అడ్డంకి కాదా? అక్రమ నిర్మాణాల విషయంలో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. వాటిని ఎప్పుడూ సమర్థించం’’ అని వ్యాఖ్యానించింది. ‘‘అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరికైనా ఒకే చట్టం. మతం లేదా ప్రజల విశ్వాసాలతో సంబంధం లేదు’’ అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. మునిసిపల్ కార్పొరేషన్లు, పంచాయతీలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయని తెలిపింది.
ఆన్‌లైన్ పోర్టల్‌లో అన్ని వివరాలు ఉండాలని, దానివల్ల ప్రజలకు సమాచారం లభిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఇదేసమయంలో ఐరాస ప్రతినిధి తరఫున దేశంలో ఇళ్ల లభ్యతపై సీనియర్ న్యాయవాది బృందా గ్రోవర్ వాదనలు వినిపించబోగా.. తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, దేశ న్యాయస్థానాలకు తగిన సామర్థ్యం ఉందని చెప్పారు. ఈ అంశంలో అంతర్జాతీయ జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు.
పిటిషనర్ల తరఫున న్యాయవాది సీయూ సింగ్ వాదిస్తూ.. నేరాలపై పోరాటానికి బుల్డోజర్ చర్యలను ఆయుధాలుగా వాడుకోరాదన్నారు. మైనారిటీలపై తీసుకున్న చర్యలు తక్కువేనని మెహతా పేర్కొనడాన్ని తప్పుపట్టిన ధర్మాసనం.. 4.45 లక్షల ఇళ్లను కూలగొట్టారని తెలిపింది. నేరం చేశారన్న నెపంతో వారి ఆస్తులను ధ్వంసం చేయకూడదని.. ఎవరైనా అక్రమ నిర్మాణాలను చేపడితే కూలగొట్టవచ్చని స్పష్టం చేసింది.
ఇరుపక్షాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అక్టోబరు 1 వరకు తమ అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలకు పాల్పడవద్దని గత నెల 17న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. స్పందించిన ధర్మాసనం.. ఈ అంశంపై తాము తీర్పు ఇచ్చే వరకు నాటి మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.