Health Tips : అజీర్తి అంతం ఇలా!
ABN , Publish Date - Jul 09 , 2024 | 01:58 AM
అడపాదడపా బాధిస్తే ఫరవాలేదు. కానీ అదే పనిగా అజీర్తి వేధిస్తుంటే సమస్యను సీరియ్‌సగానే పరిగణించాలి. కారణాలను వెతికి, వాటిని సరిదిద్దడంతో పాటు అవసరాన్ని బట్టి సమర్థమైన చికిత్స తీసుకోవాలి.
ఇన్‌డైజెషన్
అడపాదడపా బాధిస్తే ఫరవాలేదు. కానీ అదే పనిగా అజీర్తి వేధిస్తుంటే సమస్యను సీరియ్‌సగానే పరిగణించాలి. కారణాలను వెతికి, వాటిని సరిదిద్దడంతో పాటు అవసరాన్ని బట్టి సమర్థమైన చికిత్స తీసుకోవాలి.
నోరూరించే పదార్థాలను చూసినా, వాటి వాసన ముక్కుపుటాలకు తాకినా నోట్లో నీళ్లూరతాయి. ఇలా నోట్లోనే కాదు పొట్టలోనూ స్రావాలు ఊరతాయి. అవే డైజెస్టివ్ జ్యూసెస్. ఇవి ముందుగానే విడుదలై రెడీగా ఉండటంతో పొట్టలోకి ఆహార పదార్థాలు చేరగానే జీర్ణక్రియ మొదలవుతుంది. అయితే పరిమితంగా తింటే పనంతా సజావుగా సాగిపోతుంది. అలాకాకుండా ఎడాపెడా లాగించేస్తే ఆ ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు జీర్ణరసాలు సరిపోక పొట్టలో అసౌకర్యం మొదలవుతుంది. ఆ అసౌకర్యమే అజీర్తి. దీన్ని వైద్య పరిభాషలో ‘డిస్పెప్సియా’ అంటారు. అయితే భారీ భోజనం తిన్న వెంటనే తాత్కాలికంగా అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని భుక్తాయాసంగా భావించాలి. అదే అసౌకర్యం రోజుల తరబడి బాఽధిస్తే అది కచ్చితంగా అజీర్తే!
అజీర్తి లక్షణాలు ఇవే!
తినకపోయినా పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్
త్రేన్పులు
తల తిరుగుడు, వాంతులు
పొట్టలో శబ్దాలు, అసౌకర్యం, నొప్పి
అసిడిటీ
అజీర్తి నుంచి విముక్తి ఇలా!
సోంపుతో సూపర్‌ఫాస్ట్ రిలీఫ్‌రెండు టేబుల్ స్పూన్ల సోంపును నూనె లేకుండా వేయించి పొడి చేసుకోవాలి. గ్లాసు నీళ్లలో ఒక టీస్పూను పొడి కలుపుకుని రోజుకి రెండుసార్లు తాగలి. ఇలా చేస్తే కారంగా ఉండే పదార్థాలు తినటం వల్ల కలిగిన అజీర్తి వదులుతుంది.
అల్లంతో అజీర్తికి చెక్
జీర్ణాశయంలో అరగకుండా మిగిలిపోయిన పదార్థాలను అరిగించటానికి అల్లం సహాయపడుతుంది. కాబట్టి ఒక టీస్పూను అల్లం తురిమి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కలపాలి. కొద్దిగా నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె కూడా కలిపి నెమ్మదిగా తాగితే ఫలితం ఉంటుంది.
వాము దివ్యౌషధం
వాము అజీర్తి నివారిణి అనే విషయం అందరికీ తెలిసిందే! వాముకు అల్లం చేర్చి మెత్తగా రుబ్బాలి. ఈ ముద్దను ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కలిపి రోజుకి రెండుసార్లు తాగితే అజీర్తి నుంచి ఉపశమనం కలుగుతుంది.
నీళ్లతో అజీర్తి రిలీఫ్
ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అజీర్తి లక్షణాలు వేధిస్తుంటే కొద్ది కొద్ది పరిమాణాల్లో నీళ్లు తాగుతూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగితే ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి వీలైనన్ని ఎక్కువ నీళ్లు కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే జీర్ణక్రియ మెరుగై సమస్య పరిష్కారమవుతుంది.
సోడా ఉప్పుతో సో బెటర్
అజీర్తితో తలెత్తే అసిడిటీ వదలాలంటే ఒక గ్లాసు నీళ్లలో టీస్పూను సోడా ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో పొట్టలోని యాసిడ్ న్యూట్రలైజ్ అయి ఛాతీలో మంట తగ్గుతుంది.
యాపిల్ సెడార్ వనిగర్
అర కప్పు నీళ్లలో ఓ టీస్పూను యాపిల్ సెడార్ వెనిగర్, కొద్దిగా తేనె కలిపి తాగాలి. ఇలా చేస్తే తిన్న ఆహారాన్ని అరిగించుకునేంత యాసిడ్ సరిపడా జీర్ణాశయంలో లేకపోయినా ఆహారం అరిగిపోతుంది.
డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి?
అజీర్తి కోసం వైద్యుల్ని కలవాలా? అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో సొంత వైద్యం సరిపోకపోవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని కలవటం మంచిది.
వరసగా వాంతులు
రక్తపు వాంతులు, విరేచనాలు
విపరీతమైన పొత్తి కడుపు నొప్పి
రెండు వారాలకు మించి అజీర్తి
24 నుంచి 72 గంటలు
మనం తీసుకున్న ఆహారం పొట్టలోనే జీర్ణమవుతుందనుకుంటాం. కానీ ఆహారం నోట్లోకి చేరుకున్నది మొదలు, జీర్ణాశయంలో, చిన్న, పెద్ద పేగుల్లో....ఇలా అది కదిలే మార్గంలోని ప్రతి అవయవంలో దశలవారీగా జీర్ణమవుతూనే ఉంటుంది. కాబట్టే తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమవటానికి కనీసం 24 నుంచి 72 గంటల సమయం పడుతుంది. అలాగే జీర్ణాశయం కెపాసిటీ గురించి కూడా మనకు కొన్ని అపోహలున్నాయి. ఎంత ఆహారం తీసుకున్నా తోలు తిత్తిలాంటి జీర్ణకోశం సాగుతూనే ఉంటుందనుకుంటాం. కానీ నిజానికి జీర్ణకోశం కెపాసిటీ 1.5 లీటర్లే! ఇంత చిన్న జీర్ణకోశంలోకి అపరిమితంగా ఆహారాన్ని తోస్తే తిరగటానికి ఇబ్బందిపడే మిక్సీ జార్‌లా మన జీర్ణకోశం ఇబ్బంది పడుతుంది. ఫలితంగా అజీర్తి, పొట్టలో నొప్పి సమస్యలు మొదలవుతాయి.
ఎక్కువ తింటే ఏమవుతుంది?
పరిమితికి మించి తిన్నప్పుడు శరీరంలో ఈ మార్పులు జరుగుతాయి.
పొట్ట లావవుతుంది: ఎక్కువ తిన్నప్పుడు ఆ పదార్థాలకు చోటు కల్పించటం కోసం జీర్ణాశయం సాగుతుంది. దాంతో దాని చుట్టుపక్కన ఉంటే అంతర్గత అవయవాలు నెట్టబడతాయి. దాంతో పొట్టలో నొప్పి మొదలవుతుంది.
పొట్ట బరువుగా: ఆహారం మింగినప్పుడల్లా కొంత గాలి పొట్టలోకి చేరుకుంటూ ఉంటుంది. ఈ గాలి త్రేన్పుల రూపంలో బయటకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే త్రేన్పు బయటికొచ్చేస్తే ఫర్వాలేదు. అందుకు అడ్డంకి ఏర్పడితే పొట్టలో ఇబ్బంది మొదలవుతుంది.
ఛాతీలో మంట: ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నవాహికలోకి ఎగదన్నుతుంది. దాంతో ఛాతీలో మంట మొదలవుతుంది. జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పట్టే కొవ్వు, తీపి పదార్థాలు తిన్నప్పుడు ఈ సమస్య బాధిస్తుంది.
శ్రమకు లోనయ్యే ఆర్గాన్స్: పరిమితికి మించి ఆహారం తిన్నప్పుడు దాన్ని అరిగించుకోటానికి సరిపడా స్రావాలను విడుదల చేయటం అంతర్గత అవయవాలు అవసరానికి మించి శ్రమ పడాల్సి ఉంటుంది. ఇలా తరచుగా జరుగుతూ ఉంటే మెటబాలిజం, ఎండోక్రైన్ పనితీరు గాడితప్పి గ్రోత్ హార్మోన్ తగ్గటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మొదలైన సమస్యలు మొదలవుతాయి.
మెదడు చెప్పింది వినాలి
తీసుకునే ఆహారం ద్వారా పొట్టలోకి చేరుకునే కొవ్వు కణాలు ‘లెప్టిన్’ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. ఈ హార్మోన్ మన మెదడుకు సంకేతాలు పంపిస్తుంది. తిన్నది సరిపోయిందని, ఇక తినాల్సిన అవసరం లేదని ఈ హార్మోన్ పంపే సంకేతాలు అందుకున్న మెదడు ఆకలి తీరిందనే భావన కలిగేలా చేస్తుంది. దాంతో మనం తినటం ముగిస్తాం. కానీ త్వరత్వరగా తినేవాళ్లలో ఈ మెకానిజం గాడి తప్పుతుంది. మెదడుకు సిగ్నల్స్ వెళ్లక పొట్ట నిండినా ఇంకా తింటూనే ఉంటాం. దాంతో స్థూలకాయులుగా తయారయ్యే ప్రమాదం ఉంది.
పొట్టలో తయారయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒక రోజులో దాదాపు 2 లీటర్ల పరిమాణానికి కూడా చేరుకోవచ్చు.
జీర్ణక్రియలో భాగంగా మనం తీసుకున్న ఆహారం జీర్ణాశయంలో కనీసం రెండు నుంచి మూడు గంటలపాటు ఉంటుంది.
శరీర ఉష్ణోగ్రతతో సమం చేయటం కోసం మన నోరు అక్కడికి చేరుకున్న ఆహారంసం ఉష్ణోగ్రతను పెంచటం లేదా తగ్గించటం చేస్తుంది.
మనం ఒక ఏడాదిలో కనీసం 500 కిలోల ఆహారం తీసుకుంటాం.
కొవ్వు కలిగిన పదార్థం జీర్ణమవటానికి కనీసం 6 గంటల సమయం పడుతుంది.
పిండి పదార్థాలున్న పదార్థం జీర్ణమవటానికి రెండు గంటలు సరిపోతుంది.
11 లీటర్ల పదార్థాలు, జీర్ణ రసాలు జీర్ణ వ్యవస్థలో సర్క్యులేట్ అయితే చివరికి విసర్జించబడేది 100 మి.లీటర్లే!
తీసుకున్న ఆహారంలోని 90 ు పోషకాలు చిన్న పేగుల్లోనే శోషణ చెందుతాయి.
ప్రతి 5-10 రోజులకు జీర్ణాశయం లోపల కొత్త రక్షణ పొర తయారవుతూ ఉంటుంది.