Share News

Kid's Diet : అమ్మ చేతి గోరుముద్ద!

ABN , Publish Date - Sep 03 , 2024 | 01:26 AM

పిల్లలు తినడానికి మొండికేస్తారు. అయిష్టత ప్రదర్శిస్తారు. బలవంతం చేస్తే ఏడ్చేస్తారు. అలాగని వదిలేస్తే పిల్లలకు పోషకాలు అందేదెలా? ఇలాంటప్పుడు పిల్లలకు బలవర్ధక ఆహారం మీద ఇష్టం పెరిగే చిట్కాలు పాటించాలి!

Kid's Diet : అమ్మ చేతి గోరుముద్ద!

కిడ్స్‌ డైట్‌

పిల్లలు తినడానికి మొండికేస్తారు. అయిష్టత ప్రదర్శిస్తారు. బలవంతం చేస్తే ఏడ్చేస్తారు. అలాగని వదిలేస్తే పిల్లలకు పోషకాలు అందేదెలా? ఇలాంటప్పుడు పిల్లలకు బలవర్ధక ఆహారం మీద ఇష్టం పెరిగే చిట్కాలు పాటించాలి!

పిల్లల పోషకాహారం గురించిన అవగాహన తల్లుల్లో పెరగడం అభినందనీయమే! అయితే ఆ ఆహారంలో విటమిన్లు, ఖనిజలవణాలు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు ఉండేలా సరి చూసుకోవడమూ అవసరమే! అయితే అవన్నీ ప్రాంతీయపరమైన, సంప్రదాయపూరితమైన, రుతుపరమైన ఆహార పదార్థాలేనా? మనం తినే ఆహారం, నివసించే వాతావరణాలతో మన అనుబంధం కాలక్రమేణా బలహీనపడుతోంది. ఇప్పటికి పదేళ్ల వెనక్కు వెళ్తే ఏ ఇంట్లో చూసినా పప్పు, అన్నంతో కూడిన భోజనమే తినేవాళ్లం.

పిల్లలూ వాటినే ఇష్టంగా తినేవాళ్లు. కానీ ఇప్పుడు పోషకాల మీద పెరిగిన అవగాహన మూలంగా, పిండిపదార్థాలు, కొవ్వులను దూరం పెట్టేస్తున్నాం. ఏం కొంటున్నా, లేబుల్‌ పరీక్షించి, కేలరీలు లెక్కిస్తున్నాం. కానీ ఇలాంటి విపరీతమైన అప్రమత్తత వల్ల ఎక్కువ సందర్భాల్లో విలువైన పోషకాలకు దూరమవుతున్నాం. ఫిట్‌గా ఉండడానికి బదులు లావుగా తయారవుతున్నాం, తేలికగా జబ్బుల బారిన పడుతున్నాం. పోషకాలను బట్టి ఆహారాన్ని ఎంచుకునే ధోరణి వల్ల లాభపడేది ఆహార సంస్థలే! ప్రజల ఆరోగ్యానికి ఈ ధోరణి ఏమాత్రం ప్రయోజనకారి కాదు. కాబట్టి మరీ ముఖ్యంగా పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో అమ్మమ్మల నాటి పాతవి, ఆరోగ్యకరమైన పద్ధతులనే ఎంచుకోవాలి.


  • అమ్మమ్మల ఆహారం!

ప్రపంచం మొత్తంలో స్థూలకాయం కలిగిన పిల్లలున్న దేశంగా భారతదేశం రెండవ స్థానంలో ఉంది. అంతమాత్రాన మనం పిల్లలు, వారి ఆహారపుటలవాట్లను అశ్రద్ధ చేస్తున్నామని కాదు. నిజానికి వారి ఆహారం పట్ల మనం అవసరానికి మించిన శ్రద్ధ ప్రదర్శిస్తున్నాం. పోషకాలున్న ఆహారం అది ప్రాంతీయమైనది కాకపోయినా, వెతికి వెతికి తినిపిస్తున్నాం. కానీ మన అమ్మలు, అమ్మమ్మలు ఇలా చేయలేదు. ఏ రుతువులో కాచే కాయలను ఆ రుతువుల్లో తినిపించారు. పొట్టు తీయని ధాన్యాలు, పెరట్లో పండిన కూరగాయలు, పళ్లు అందించారు.

అప్పట్లో వంటగది ఇంటి మధ్యలో ఉండేది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వంటింట్లోకి వెళ్లి ఆహారం అందుకుని తినేటందుకే ఈ ఏర్పాటు. పాలు, పెరుగు, కమ్మని వెన్న, నెయ్యి, జున్నులు ప్రతి ఇంట్లో తాజాగా, సిద్ధంగా ఉండేవి. సున్నుండలు, అరిసెలు లాంటి బలవర్థకైన చిరుతిళ్లు డబ్బాల్లో నింపి ఉంచేవారు. సెనగపప్పు ఉండలు, వేరుశనగ చెక్కలు, బెల్లం జిలేబీలు...ఇవన్నీ రక్తవృద్ధిని పెంచే చిరుతిళ్లే! వీటిలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్‌, కృత్రిమ రంగులూ ఉండవు. కానీ ఇలాంటి వంటలు వండే బదులు, పాశ్చాత్య ఆహార పద్ధతులను అనుసరిస్తూ మాంసకృత్తుల కోసం సోయా, అవకాడొల మీద, పీచు కోసం ఓట్స్‌ మీద ఆధారపడుతున్నాం! వీటికంటే మెరుగైన ప్రత్యామ్నాయ, సంప్రదాయ పదార్థాలు ఎన్నో ఉన్నాయి.


  • పేచీ పెట్టే పిల్లలతో ఇలా...

కొంతమంది పిల్లలు తినడానికి పేచీ పెడతారు. ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయల పట్ల అయిష్టత ప్రదర్శిస్తారు. ఇలాంటప్పుడు పిల్లలకు ఆ ఆహారం పట్ల ఆసక్తి ఏర్పరిచే ప్రయత్నంచేయాలి. ఇందుకోసం పాలకూరను పెరట్లోనే పెంచాలి. పూల తొట్లలో కొత్తిమీర, పుదీనా, ఆకుకూరల విత్తనాలు చల్లి పిల్లల చేత వాటికి నీళ్లు పోయిస్తూ ఉండాలి. కూరగాయలు, ఆకుకూరలు ఎదిగే క్రమాన్ని పిల్లలు పరిశీలించేలా చేయాలి. అలాగే కూరగాయలు పండించే తోటలకు అరుదుగానైనా పిల్లలను తీసుకెళ్తూ ఉండాలి. పళ్లు, కూరగాయ మొక్కలను పిల్లలు గమనించేలా చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ మొక్కల ఉత్పత్తుల పట్ల పిల్లలకు ఆసక్తి పెరుగుతుంది. వాటి వంటలను ఆస్వాదించాలనే కోరిక కూడా పెరుగుతుంది.

ఆహారంతో అనుబంధం ఏర్పరచాలంటే పర్యావరణంతోనూ అనుబంధం ఏర్పరచాలి. పెద్దలు ఈ విషయంలో పిల్లలకు మార్గనిర్దేశకులుగా మారాలి. అలాగే బయట భోజనాలకు స్వస్థి చెప్పి, ఇంటి భోజనానికే పెద్దలు కట్టుబడి ఉండాలి. పిల్లలకూ ఆ అలవాటు నేర్పాలి. వంటింట్లో వంటపనిలో నిమగ్నమయ్యే తల్లులను చూసిన పిల్లలు కచ్చితంగా వంటగదిలో తయారయ్యే ఆహారాన్ని ఇష్టపడతారు. అలాగే కుటుంబసభ్యులందరూ నిర్దిష్ట సమయాల్లో కలిసి కూర్చుని భోజనం చేసే కట్టుబాటు అనుసరించాలి. ఆ సమయంలో టివి, సెల్‌ఫోన్‌ లాంటి వాటికి చోటు ఇవ్వకూడదు.


  • పోషకాల చిరుతిళ్లు ఇవే!

పిల్లలకు జంతికలు, గవ్వలు లాంటి నిల్వ పిండిపదార్థాలనే చిరుతిళ్లుగా ఇవ్వవలసిన అవసరం లేదు. పచ్చికూరగాయ ముక్కలకు ఉప్పు, నిమ్మరసం, చాట్‌ మసాలా జోడించి సలాడ్‌గా అందించవచ్చు. మొలకెత్తిన పెసలు, సెనగలు ఒక టీస్పూన్‌ నూనెలో వేయించి, క్రంచీగా ఉండడం కోసం వేయించిన వేరుసెనగ పప్పులు చల్లి, నిమ్మరసం కలిపి అందించవచ్చు.

షియా విత్తనాలు నానబెట్టి, పండ్ల ముక్కలు, తేనె కలిపి తినిపించవచ్చు. కీర దోస లేదా జుకినిలను పొడవుగా తరిగి, ఉప్పు, చిల్లీఫ్లేక్స్‌, మొక్కజొన్న పిండి కలిపిన మిశ్రమంలో ముంచి, బ్రెడ్‌ పొడి అద్ది నూనెలో వేయించి అందించవచ్చు. కూరగాయలు కలిపి ఆమ్లెట్‌ వేసి ఇవ్వొచ్చు. పులిసిన పిండితో రొట్టెలు, చద్ది అన్నంతో దద్దోజనం లాంటివి కూడా ఆరోగ్యకరమే! ఆవిరి మీద ఉడికించిన చికెన్‌, చేప ముక్కలు లేదా గ్రిల్‌ చేసినవీ పిల్లలకు అందించవచ్చు. పండ్లముక్కలతో కస్టర్డ్‌ తయారుచేసి పెట్టవచ్చు.


  • ఆకలి తెలియనివ్వాలి

సాధారణంగా భోజన వేళకు పిల్లలు కూడా కడుపు నిండా తినడం అన్నిసార్లూ వీలుపడకపోవచ్చు. అప్పుడప్పుడూ పిల్లల ఆకలి మందగిస్తూ ఉంటుంది. కాబట్టి తినడానికి పేచీ పెట్టినప్పుడు, బలవంతంగా తినిపించే ప్రయత్నం చేయకూడదు. ఆకలి ఉంటేనే పిల్లలకు ఆహారం అందించాలి. భయపెట్టి, బుజ్జగించి తినిపించడం వల్ల తల్లులు ఆశించే ప్రయోజనం నెరవేరకపోవచ్చు. సాధారణంగా తల్లులు, బడికెళ్లే ఈడు వరకూ పిల్లలకు ముద్దలు చేసి తినిపిస్తూ ఉంటారు.

కానీ ఈ పద్ధతి కూడా సరికాదు. నడక వచ్చిన వయసు నుంచే పిల్లలు స్వతంత్రంగా తినే అలవాటు చేయాలి. ప్రతి రోజూ ఒకే సమయానికి, ఒకే ప్రదేశంలో తినే ఏర్పాట్లు ఉండాలి. పదార్థాలు నేల మీద పడిపోతాయనో, పిల్లలు చిందరవందర చేస్తారనో, దుస్తులు పాడైపోతాయనో పిల్లలను సొంతగా ఆహారం తిననివ్వకుండా అడ్డుకోకూడదు. పిల్లల కోసం ప్రత్యేకంగా తయారయ్యే స్పూన్లు, ఫోర్కులు, బౌల్స్‌, ప్లేట్స్‌నే వాడుకోవడం వల్ల వాటితో పిల్లలకు గాయాలు అవకుండా ఉంటాయి. నేల మీద పడినా పగిలిపోకుండా ఉండే పదార్థాలతో తయారైన పాత్రలు, స్పూన్లనే వాడుకోవాలి.


  • పిల్లల ఆహారం పసందుగా...

అన్నం, వేరుసెనగపప్పు, నెయ్యి, ఒక పండు, ఇంట్లో తయారైన లడ్డు... ఇదీ పిల్లలకు అనునిత్యం ఇవ్వవలసిన ఆహారం. వీటితోపాటు కూరగాయలు, ఇంట్లో వండిన ఎటువంటి ఆహారమైనా ఇవ్వవచ్చు. చిరుతిళ్లుగా గుప్పెడు వేరుసెనగపప్పులు, తాజా పండ్లు, అటుకుల ఉప్మా, గోధుమరొట్లె, బెల్లం ముక్క, ఇంట్లో తయారైన సున్నుండలు, లడ్లు... ఇలా పోషకభరితమైన చిరుతిళ్లను పిల్లలకు అలవాటు చేయాలి. ‘ఫలానా పాఠం తప్పు లేకుండా రాసి చూపిస్తే, చాక్లెట్లు ఇప్పిస్తా!’ లాంటి ఆశ పెట్టే పద్ధతులు మానేయాలి.

చాక్లెట్లను వారానికి ఒకసారికే పరిమితం చేయాలి. గోధుమ బియ్యంలో పోషకాలు అధికం. అలాగని వాటిని వండి పెడితే పిల్లలు తినడానికి ఇష్టపడరు. కాబట్టి బియ్యంతోపాటు రెండు గరిటెల గోధుమ బియ్యం కలిపి వండి పెట్టవచ్చు. క్యారట్‌, క్యాప్సికమ్‌ లాంటి కూరగాయలను అందమైన ఆకారాల్లో కోసి, ఆకర్షణీయమైన అలంకరణతో వడ్డించి, పిల్లల్లో ఆసక్తినీ రేకెత్తించవచ్చు. వీలైనంత వరకూ భిన్నమైన పోషకాలు అందేలా మూడు, నాలుగు కూరగాయలను కలిపి వండవచ్చు. ఇలా పిల్లలకు నచ్చే, వారు మెచ్చే తరహాలోనే ఆహారం పట్ల వారికి ఇష్టాన్ని రెట్టింపు చేయవచ్చు.

Updated Date - Sep 03 , 2024 | 01:26 AM