Share News

KCR-YS Jagan : ఏపీ సీఎం జగన్‌కు కేసీఆర్ కీలక సూచనలు.. ఏకాంత చర్చలు!

ABN , Publish Date - Jan 04 , 2024 | 04:02 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) ఏపీ సీఎం జగన్ (Jagan) పరామర్శించారు. జూబ్లీహిల్స్ నందినగర్‌లో గల కేసీఆర్ నివాసానికి సీఎం జగన్ వచ్చారు. ఇటీవల బాత్ రూమ్‌లో కాలుజారి కేసీఆర్ (KCR) పడటంతో హిప్ రీప్లెస్ మెంట్ సర్జరీ యశోదలో జరిగిన సంగతి తెలిసిందే.

KCR-YS Jagan : ఏపీ సీఎం జగన్‌కు కేసీఆర్ కీలక సూచనలు.. ఏకాంత చర్చలు!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) పరామర్శించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నందినగర్‌లో గల కేసీఆర్ నివాసానికి వచ్చిన జగన్.. గులాబీ బాస్‌ను పరామర్శించి.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను జగన్‌కు కీలక సలహాలు, సూచనలు కేసీఆర్ చేశారు.

ఏం చర్చించారు..?

ఇటీవల బాత్ రూమ్‌లో కాలుజారి కేసీఆర్ (KCR) పడటంతో హిప్ రీప్లెస్ మెంట్ సర్జరీ యశోదలో జరిగింది. ఆస్పత్రిలో ఉండగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు పరామర్శించారు. ఏపీ సీఎం జగన్ ఈ రోజు కేసీఆర్‌ను (KCR) కలిశారు. ఇద్దరు నేతలు ఏకాంతంగా 45 నిమిషాల పాటు చర్చలు జరిపారని తెలిసింది. ఏపీ రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాం, లోక్ సభ ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం.


KCR-FINAL.jpg

ఓటమి చెప్పిన గుణపాఠం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైన సంగతి తెలిసిందే. అందులో ప్రధాన లోపం.. మెజార్టీ సీట్లను సిట్టింగులకు ఇవ్వడం. దీంతో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైంది. 64 సీట్లతో రేవంత్ నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. కాగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ (Jagan) దృష్టిసారించారు. ఇప్పటికే సిట్టింగులను దూరం పెడుతున్నారు. రెండు విడతల్లో దాదాపు 50 మందికి టికెట్లు ఇవ్వనని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల గురించి జగన్‌కు కేసీఆర్ పలు సూచనలు చేశారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తప్పులు చేయొద్దని చెప్పారని తెలిసింది. అంటే కేసీఆర్ నుంచి ఓటమి గుణపాఠాలు జగన్‌కు గట్టిగానే అందాయన్న మాట.

KCR-And-Jagan-Meeting.jpg

సార్.. హితోపదేశం!

ప్రధానంగా సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం ఒక అంశం.. ఎన్నికల వ్యుహకర్తలతో ప్రచారం మరో అంశంగా మారింది. ఏదీ ఏమైనప్పటికీ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చాలని కేసీఆర్ హితోపదేశం చేశారని తెలిసింది. లోక్ సభ ఎన్నికల్లో పరస్పర సహకారంపై కూడా సమావేశంలో చర్చకు వచ్చిందట. తెలంగాణలో వైసీపీ బీఆర్ఎస్ పార్టీకి, ఆంధ్రాలో బీఆర్ఎస్ వైసీపీకి సపోర్ట్ చేసేలా ప్రతిపాదన వచ్చిందని విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి, పార్టీని విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కూడా కేసీఆర్- జగన్ మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. ఇలా వివిధ అంశాలపై 45 నిమిషాల పాటు చర్చించారు. గులాబీ బాస్ చెప్పిన గుణపాఠాలు జగన్‌కు ఏమాత్రం పనికొస్తాయో.. ఆయన ఎంత పాత్రం పాటిస్తారో చూడాలి మరి.

Updated Date - Jan 04 , 2024 | 04:35 PM