Malla Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి..!
ABN , Publish Date - Mar 07 , 2024 | 06:39 PM
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఊహించని పరిణామం చోటుచేసుకోనుందా..? అతి త్వరలోనే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Malla Reddy) ‘కారు’ దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా..? తన కుమారుడిని మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమే అనిపిస్తోంది..
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఊహించని పరిణామం చోటుచేసుకోనుందా..? అతి త్వరలోనే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Malla Reddy) ‘కారు’ దిగి కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకోనున్నారా..? తన కుమారుడిని మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమే అనిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగింది..? మల్లారెడ్డి నిజంగానే ఇలా చేస్తున్నారా..? ఈ మొత్తం వ్యవహారంలో మతలబు ఏంటి..? ఎవరి ద్వారా ఇదంతా నడుస్తోంది..? అనే ఇంట్రస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
BRS: కేసీఆర్‌పై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం.. ఏదో ఒకటి తేల్చాలని ఘాటు లేఖ!
ఇదీ అసలు సంగతి..!
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవిచూశాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్, బీజేపీలు సత్తా చాటడానికి వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ క్రమంలో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్‌లు చేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం అయ్యింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే బీఆర్ఎస్‌కు బై.. బై చెప్పేసి ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని అటు బీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్‌లో చర్చే జరుగుతోంది. దీనికి తోడు ఇలా వార్తలు వస్తున్నప్పుడే తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం.
ఏం చర్చించారో..?
సుమారు అరగంటకుపైగా జరిగిన ఈ భేటీలో అల్లుడి కాలేజీ భవనాల కూల్చివేతలు మొదలుకుని.. కాంగ్రెస్‌లో చేరితే తన కుమారుడికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ వరకూ అన్ని విషయాలను నిశితంగా చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా మహేందర్‌కు టికెట్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు మల్లారెడ్డి. ఇదిలా ఉంటే.. భాగ్యనగరంలోని దుండిగల్‌లో ఉన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లోని మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీకి చెందిన రెండు శాశ్వత భవనాలను, ఆరు తాత్కాలిక షెడ్లను అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించి.. కూల్చివేయడం జరిగింది.
AP Politics: ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఏం చేయబోతున్నారు.. అందరి చూపు ఇటే..!
ఇద్దరు మిత్రులే..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మల్లారెడ్డి ఇద్దరూ మంచి మిత్రులే. ఒకప్పుడు ఇద్దరూ టీడీపీలో పనిచేసిన వారే.. సీనియర్ నేతలే. అప్పుడున్న పరిస్థితుల రీత్యా రేవంత్ కాంగ్రెస్‌లో చేరడం.. మల్లారెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో చోటు కూడా దక్కించుకున్నారు. అటు కాంగ్రెస్‌లో చేరిన రేవంత్.. రాష్ట్ర అధ్యక్షుడిగా.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఓ రేంజ్‌లో విమర్శలు, సవాళ్లు ఆఖరికి తొడలు కూడా కొట్టుకున్న పరిస్థితి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోవడంతో బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చేసి కాంగ్రెస్‌లో చేరాలని మల్లారెడ్డి భావిస్తున్నారట. ఇందులో భాగంగానే గురువారం నాడు వేం నరేందరెడ్డితో మల్లారెడ్డి భేటీ కావడం.. టికెట్ కావడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయట. అయితే.. కాలేజీ కూల్చివేతలు ఆపడం కోసమే ఈ భేటీ జరిగిందని మల్లారెడ్డి అనుచరులు కొందరు చెబుతున్నప్పటికీ.. మాజీ మంత్రి మాత్రం ఎక్కడా ఈ విషయాలను కొట్టేసిన పరిస్థితి లేదు. ఒకవేళ కాంగ్రెస్‌లో చేరిక నిజమే అయితే మాత్రం ‘ఇద్దరు మిత్రులు’ మళ్లీ కలుస్తారన్న మాట. పైగా ఈ మధ్య చేరికలన్నీ దాదాపు వేం నరేందర్ రెడ్డే చూసుకుంటున్న సంగతి తెలిసిందే. అటు కూల్చివేతలు.. ఇటు భేటీ ఇవన్నీ ఈ వార్తలకు బలం చేకూరుతోంది. ఫైనల్‌గా మల్లన్న ఊహించని ట్విస్టే ఇస్తారో లేకుంటే.. అబ్బే అదేం లేదని సింపుల్‌గా చెబుతారో చూడాలి మరి.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి