Viral Video: వరద ప్రవాహంలో కారు.. 2 గంటలు నరకం చూసిన దంపతులు..
ABN , Publish Date - Sep 09 , 2024 | 01:39 PM
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతి తక్కువగా ఉందని భావించి ఓ దంపతులు తమ కారుతో కాజ్‌వేను..
అహ్మదాబాద్, సెప్టెంబర్ 09: దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతి తక్కువగా ఉందని భావించి ఓ దంపతులు తమ కారుతో కాజ్‌వేను దాటే ప్రయత్నం చేశారు. అయితే, వరద ఉధృతి అధికంగా ఉండటంతో కారు నదిలో కొట్టుకుపోయింది. ఓ చోట రాళ్ల మధ్యలో చిక్కుకుపోవడంతో.. కారులో దింపతులిద్దరూ కారు టాప్ పైకి ఎక్కారు. దాదాపు రెండు గంటల పాటు కారు టాప్ పైనే బిక్కు బిక్కుమంటూ ఉండిపోయారు. చివరకు పోలీసులు వచ్చి.. రెస్క్యూ చేశారు. తొలుత నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో దంపతులను కాపాడే ప్రయత్నం విఫలమైంది. ఆ తరువాత కాస్త ప్రవాహం తగ్గగానే.. వారిద్దరినీ కాపాడారు. నీటి నుంచి బయటకు తీసుకువచ్చారు.
తమకంటే ముందు మరో వాహనం కూడా కాజ్‌వే ను దాటిందని బాధిత వ్యక్తి సురేశ్ మిస్త్రీ చెప్పుకొచ్చాడు. ఆ వాహనం వెళ్లడంతో తమ వాహనం కూడా వాగు దాటుతుందని విశ్వసించామని.. అందుకే వెళ్లామని చెప్పాడు. కానీ, ఒకటి అనుకుంటే.. అక్కమ మరొకటి అయ్యింది. ఎలాగోలా చివరకు దంపతులిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటనను అక్కడి ప్రజలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. కారు కాజ్‌వే నుంచి 1.5 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. అయినప్పటికీ ఆ దంపతులిద్దరూ ధైర్యంగా కారు టాప్ ఎక్కి కూర్చున్నారు. ఏమాత్రం భయపడకుండా ప్రశాంతంగా ఉన్నారు. వీడియోలో వారి హావభావాలను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పైగా తమను కాపాడాలని పోలీస్ సిబ్బందికి సమాచారం కూడా ఇచ్చాడు మిస్త్రి. ప్రమాదంలో ఉన్నా.. ఏమాత్రం భయపడకుండా ఉన్న వారిని అభినందిస్తున్నారు నెటిజన్లు.