Viral Video: మండే ఎండకు ఉడికిన గుడ్డు.. వైరల్ అవుతున్న బీఎస్ఎఫ్ జవాన్ వీడియో
ABN , Publish Date - May 25 , 2024 | 02:07 PM
దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదువుతున్న క్రమంలో రాజస్థాన్‌లో(Rajasthan) గత వారంలోనే ఏకంగా 12 మంది వడదెబ్బతో మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
జైపుర్: దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదువుతున్న క్రమంలో రాజస్థాన్‌లో(Rajasthan) గత వారంలోనే ఏకంగా 12 మంది వడదెబ్బతో మృతి చెందారు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిపే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ మధ్య బీఎస్‌ఎఫ్ జవాన్ ఒకరు ఎండలో పాపడ్ గ్రిల్ చేస్తున్న వీడియో వైరల్ అయింది.
తాజాగా మరో జవాన్ ఇసుకలో గుడ్డును ఉడకబెట్టిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్‌లోని బికనీర్ సరిహద్దు వద్ద జవాన్లు కాపలా కాస్తున్నారు.ఎడారి సమీపంలోనే ఉండటంతో వేడి విపరీతంగా ఉంటోంది. అక్కడి ఎండల తీవ్రతను కళ్లకు కట్టేలా చూపించడానికి ఓ జవాన్ ఇసుకలో గుడ్డును ఉంచాడు. కాసేపటికే అది ఉడికి పోయింది.
సోషల్ మీడియాలో షేర్ చేసిన రెండు నిమిషాల, 59 సెకన్ల వీడియోలో సదరు జవాన్ గుడ్డును వెలికితీసి ఉడకడంతో దాన్ని తీనేస్తాడు. సరిహద్దులో అత్యంత కఠినంగా ఉండే మంచు పర్వతాలు, భగ భగ మండే ఎండల్లో జవాన్లు చేసే సాహసాలను నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి..
విపత్కర పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించే జవాన్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. జవాన్లు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వారికి వడదెబ్బ తగలకుండా నిమ్మరసం, ఇతర ద్రవాలను ఇస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో శుక్రవారం 48.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
For Latest News and Technology News