India vs Zimbabwe: భారత్ ఘనవిజయం.. ఓపెనర్లే బాదేశారు.. సిరీస్ కైవసం
ABN , Publish Date - Jul 13 , 2024 | 07:38 PM
జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌లో.. భారత జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఆతిథ్య జట్టుతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో అఖండ విజయం నమోదు చేసింది. ఆ జట్టు...
జింబాబ్వేతో (Zimbabwe) జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌లో.. భారత జట్టు (Team India) వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఆతిథ్య జట్టుతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో అఖండ విజయం నమోదు చేసింది. ఆ జట్టు నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఒక్క వికెట్ కోల్పోకుండానే 15.2 ఓవర్లలో (156) ఛేధించింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (93), శుభ్‌మన్ గిల్ (58) ఊచకోత కోసి.. భారత జట్టుకి ఈ అపూర్వ విజయాన్ని అందించారు. దీంతో.. 3-1 తేడాతో భారత్ టీ20I సిరీస్‌ని కైవసం చేసుకుంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సికందర్ రజా (46) మెరుపులు మెరిపించడంతో పాటు ఓపెనర్లు వెస్లీ, మారుమని (32) పర్వాలేదనిపించడంతో.. ప్రత్యర్థి జట్టు భారత్‌కు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఇక లక్ష్య ఛేధనలో భాగంగా.. భారత ఓపెనర్లు మొదటి నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ముఖ్యంగా.. యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. ఓవైపు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సహకారం అందిస్తుంటే, మరోవైపు అతను బౌండరీల మోత మోగించేశాడు. ఇక గిల్ సైతం క్రీజులో కుదురుకున్నాక తన బ్యాట్‌కి పని చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా ఇద్దరూ దుమ్ముదులిపేయడంతో.. 15.2 ఓవర్లలోనే 156 పరుగులు చేసి, భారత్ గెలుపొందింది.
ఒకానొక దశలో యశస్వీ జైస్వాల్ శతకం కొడతాడని అంతా అనుకున్నారు. కానీ.. అదే సమయంలో గిల్ కూడా అర్థశతకానికి దగ్గరలో ఉన్నాడు. అప్పుడు తనకు ఓ అనుకూలమైన బంతి రావడంతో.. గిల్ సిక్స్ బాది, తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో.. జైస్వాల్‌కి సెంచరీ చేసే ఛాన్స్ మిస్ అయ్యింది. ఇక జింబాబ్వే బౌలర్ల విషయానికొస్తే.. దాదాపు ప్రతి ఒక్కరూ భారీగా పరుగులు సమర్పించేసుకున్నారు. ముజరబాని ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. ఓపెనర్లను ఎలాగైనా పెవిలియన్ పంపించాలని గట్టిగానే ట్రై చేశారు కానీ.. జైస్వాల్ బాదుడితో ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. దాంతో.. భారీ పరుగులు ఇచ్చుకున్నారు.
స్కోర్లు
జింబాబ్వే: 152/7 (20 ఓవర్లు)
భారత్: 156/0 (15.2 ఓవర్లు)