Share News

Shubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. విరాట్ కోహ్లీ తర్వాత అతడే!

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:46 PM

జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్.. ఆ తర్వాత వరుసగా..

Shubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. విరాట్ కోహ్లీ తర్వాత అతడే!
Shubman Gill

జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్ (Team India).. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలోనే.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విదేశీ గడ్డపై నాలుగు విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తర్వాత ఈ ఫీట్ సాధించింది అతడే!


2019-20 సమయంలో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు న్యూజీలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. అందులో భారత్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించి, 5-0 తేడాతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే.. కోహ్లీ తొలి నాలుగు మ్యాచ్‌లకే నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించాడు. ఐదో మ్యాచ్‌కి అతను అందుబాటులో లేకపోవడంతో.. ఆ ఆఖరి గేమ్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు. ఈ లెక్కన.. కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు విదేశీ గడ్డపై నాలుగు విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత జింబాబ్వే సిరీస్‌తో ఆ రికార్డును శుభ్‌మన్ గిల్ తిరగరాశాడు.


అంతేకాదండోయ్.. ఇదే సిరీస్‌తో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. భారత జట్టుకి అత్యధిక విజయాలు సాధించిపెట్టిన కెప్టెన్ల జాబితాలో.. ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ లిస్టులో రోహిత్ శర్మ 50 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ధోనీ (42), విరాట్ కోహ్లీ (32), హార్దిక్ పాండ్యా (10), సూర్యకుమార్ యాదవ్‌ (5) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. భవిష్యత్తులో శుభ్‌మన్‌కు ఇలాంటి అవకాశాలే మరిన్ని వస్తే.. అప్పుడు తప్పకుండా సూర్య, హార్దిక్‌లను అతను వెనక్కు నెట్టేయడం ఖాయం.


ఈ టీ20 సిరీస్ అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఇదో అద్భుతమైన సిరీస్ అని పేర్కొన్నాడు. మొదటి మ్యాచ్‌లో తాము ఓటమి చవిచూసినా.. ఆ తర్వాత తమ జట్టు సభ్యులు ఫుల్ ఫామ్‌లోకి తిరిగొచ్చారని.. జట్టు ప్రదర్శనపై తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపాడు. తమ టీమ్‌లో చాలామందికి విదేశీ గడ్డపై ఆడిన అనుభవం లేకపోయినప్పటికీ.. పరిస్థితులను అర్థం చేసుకొని చాలా బాగా ఆడారన్నాడు. సమిష్టి కృషితోనే తాము ఈ సిరీస్‌ని కైవసం చేసుకోగలిగామని.. తన తోటి ఆటగాళ్లపై శుభ్‌మన్ ప్రశంసలు కురిపించాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 15 , 2024 | 04:46 PM