Share News

Virat Kohli: సెమీ ఫైనల్స్‌లో విరాట్ కోహ్లీ తడాఖా.. ఆ రికార్డుల్ని మళ్లీ తిరగరాస్తాడా?

ABN , Publish Date - Jun 26 , 2024 | 03:29 PM

టీ20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు జరిగిన ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఎంత అద్భుత ప్రదర్శన కనబరిచాడో అందరికీ తెలుసు. ప్రతి మ్యాచ్‌లోనూ తన బెస్ట్ ఇచ్చి.. సీజన్‌లోనే అత్యధిక పరుగులు..

Virat Kohli: సెమీ ఫైనల్స్‌లో విరాట్ కోహ్లీ తడాఖా.. ఆ రికార్డుల్ని మళ్లీ తిరగరాస్తాడా?
Virat Kohli

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) ప్రారంభానికి ముందు జరిగిన ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఎంత అద్భుత ప్రదర్శన కనబరిచాడో అందరికీ తెలుసు. ప్రతి మ్యాచ్‌లోనూ తన బెస్ట్ ఇచ్చి.. సీజన్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అది చూసి.. వరల్డ్‌కప్ టోర్నీలోనూ కోహ్లీ అదే దూకుడు ప్రదర్శిస్తాడని అంతా అనుకున్నారు. కెప్టెన్ రోహిత్‌తో కలిసి జట్టుకి శుభారంభాలు అందిస్తాడని భావించారు. కానీ.. ఆ అంచనాల్ని బోల్తా కొట్టిస్తూ కోహ్లీ పేలవ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అతను కేవలం 66 పరుగులే చేశాడు. అందులో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి. దీంతో.. కోహ్లీ ఫామ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


అయితే.. విరాట్ కోహ్లీకి సెమీ ఫైనల్స్‌లో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా అతను శివాలెత్తాడు. 2014లో సౌతాఫ్రికాతో ఆడిన సెమీఫైనల్ మ్యాచ్‌లో.. యువరాజ్ సింగ్‌తో కలిసి కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ మ్యాచ్‌లో అతను 44 బంతుల్లోనే 72 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత జట్టుని గెలిపించి ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అనంతరం 2016లో వెస్టిండీస్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లోనూ ఊచకోత కోశాడు. 47 బంతుల్లోనే 89 పరుగులతో తాండవం చేశాడు. కానీ.. దురదృష్టవవాత్తూ ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఇక 2022లో ఇంగ్లండ్‌తో ఆడిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అతను 40 బంతుల్లో 50 పరుగులు చేసి.. జట్టుకి మంచి స్కోరు అందించడంలో తనవంతు సహకారం అందించాడు. కానీ.. ఆ మ్యాచ్‌లోనూ భారత్ ఓడింది.


మ్యాచ్ ఫలితాల సంగతి పక్కన పెడితే.. సెమీ ఫైనల్ అనగానే కోహ్లీ ‘జై’ అంటూ ఒక్కసారిగా ఫామ్‌లోకి వస్తాడు. తన బ్యాట్‌ను ఝుళపించి.. మైదానంలో పరుగుల సునామీ సృష్టిస్తాడు. అందుకే.. ఇంగ్లండ్‌తో జరగబోయే సెమీ ఫైనల్‌లోనూ కోహ్లీ శివాలెత్తుతాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తనపై వస్తున్న విమర్శలకు కోహ్లీ బ్యాట్‌తోనే చెక్ పెడతాడని, ఆ మ్యాచ్‌లో కచ్ఛితంగా భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని నమ్మకం వెలిబుచ్చుతున్నారు. అతను కచ్ఛితంగా ఫామ్‌లోకి తిరిగొస్తాడని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అదే జరిగితే.. భారత జట్టు విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పుకోవచ్చు. కానీ.. కోహ్లీ మళ్లీ ఫెయిల్ అయితే మాత్రం విజయావకాశాలు భారీగా దెబ్బతింటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 03:29 PM