Share News

Basara: బాసరలో బంద్‌కు పిలుపునిచ్చిన అనుష్టాన్ పరిషత్..

ABN , Publish Date - Jul 09 , 2024 | 05:40 PM

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు వివిధ ప్రాంతాల నుంచి బాసరకు తరలి వస్తుంటారు. ప్రతి ఏటా వసంత పంచమి రోజున అమ్మవారి ఆలయంలో వేలాదిగా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Basara: బాసరలో బంద్‌కు పిలుపునిచ్చిన అనుష్టాన్ పరిషత్..
Basara Temple

నిర్మల్, జులై 09: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు వివిధ ప్రాంతాల నుంచి బాసరకు తరలి వస్తుంటారు. ప్రతి ఏటా వసంత పంచమి రోజున అమ్మవారి ఆలయంలో వేలాదిగా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ ఒక్క రోజునే కాదు.. మిగతా రోజుల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుంది. అయితే, ఇంతటి పవిత్ర కార్యాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తి తమ స్వలాభం కోసం వినియోగించుకోవడం స్టార్ట్ చేశారట. కొందరు ప్రైవేట్ వ్యక్తులు.. ధనార్జనే ధ్యేయంగా, శాస్త్ర విరుద్ధంగా అక్షరాభ్యాసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఈ వివాదం మరింత ముదిరింది.


వాస్తవానికి బాసర సరస్వతీ దేవి ఆలయంలో వేద పండితులు పిల్లలకు పలకపై గానీ.. బియ్యంలో గానీ అక్షరాభ్యాసం చేయిస్తారు. కానీ, కొత్తగా వచ్చిన ప్రైవేట్ వ్యక్తులు.. పిల్లల నాలుకపై బీజాక్షరాలు రాస్తూ హడావిడి చేస్తున్నారట. ఇదే విషయమై బాసర అనుష్టాన్ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజాక్షరాలు రాస్తూ హడావిడి చేస్తున్నారని, గుడి సంప్రదాయాలను భ్రష్టుపట్టిస్తున్నారంటూ పరిషత్ సభ్యులు మండిపడుతున్నారు. గుడి సంప్రదాయాలను భ్రష్టుపట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అనుష్టాన్ పరిషత్ తీర్మానం చేసింది. ఇదే విషయమై ఆలయ అధికారులకు ఫిర్యాదు కూడా చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన ఆలయ అధికారులు.. నాలుకపై బీజాక్షరాలు రాసే వారిని నమ్మొద్దని, వారంతా ఫేక్ అని చెబుతూ ఆలయం పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు.


కాగా, ఈ బీజాక్షరాల వివాదం మరింత ముదరడంతో.. అనుష్టాన్ పరిషత్ కీలక నిర్ణయం తీసుకుంది. బీజాక్షరాలను రాయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బాసర సరస్వతి ఆలయ అనుష్టాన్ పరిషత్.. బుధవారం నాడు బాసర బంద్‌కు పిలుపునిచ్చింది. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా బీజాక్షరాలతో అక్షరాభ్యాసం చేస్తూ బాసర క్షేత్రానికి అపఖ్యాతి తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనుష్టాన్ పరిషత్ సభ్యులు.


ఎవరు చేస్తున్నారు ఇదంతా..

భారతదేశంలోనే జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువైన రెండవ పుణ్యక్షేత్రం బాసర. ఈ క్షేత్రంలో ప్రజలు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే తమ పిల్లలు ప్రయోజకులు అవుతారని, జ్ఞానవంతులై ఉన్నత స్థాయికి చేరుకుంటారని నమ్మకం. అయితే, ఈ నమ్మకాన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అనుష్టాన్ పరిషత్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ధనార్జనే లక్ష్యంగా బాసరలో ప్రైవేట్ వేద పాఠశాలలు ఏర్పాటు చేసి.. బీజాక్షరాలతో అక్షరాభ్యాసం చేయిస్తామని, తద్వారా వారి పిల్లలు ప్రయోజకులు అవుతారంటూ ప్రజలను నమ్మబలుకుతున్నారని మండిపడుతున్నారు. వెంటనే బాసరలో బీజాక్షరాల అక్షరాభ్యాసాలను నిలిపివేయాలని, వారం రోజులు సమయం ఇస్తున్నామని అనుష్టాన్ పరిషత్ సభ్యులు హెచ్చరించారు. లేదంటే.. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు.

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 09 , 2024 | 05:40 PM