Share News

Wedding Dates: పెళ్లికి వేళాయె..

ABN , Publish Date - Aug 06 , 2024 | 03:57 AM

పరస్పరం నచ్చేసి.. నిశ్చితార్థం కూడా జరిగిపోయి పెళ్లి కోసం ఎదురుచూస్తున్న అమ్మాయి, అబ్బాయిల కోసం శుభ ముహూర్తాలు వచ్చేశాయ్‌! ఆ ఇళ్లలో ఇక పెళ్లి బాజాలు మోగనున్నాయి.

Wedding Dates: పెళ్లికి వేళాయె..

  • మూఢాలు పోయాయ్‌.. పెళ్లి ముహూర్తాలొచ్చేశాయ్‌

  • రేపటి నుంచి 28వ తేదీ వరకు 10 శుభ ముహూర్తాలు

  • 11, 18వ తేదీల్లో అత్యధిక సంఖ్యలో పెళ్లిళ్లు

  • 4 నెలలకు శుభ ఘడియలు మళ్లీ అక్టోబరు 13దాకా లేవు

  • ఫంక్షన్‌ హాల్‌, కేటరింగ్‌, డెకరేషన్‌ వ్యాపారుల్లో ఉత్సాహం

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పరస్పరం నచ్చేసి.. నిశ్చితార్థం కూడా జరిగిపోయి పెళ్లి కోసం ఎదురుచూస్తున్న అమ్మాయి, అబ్బాయిల కోసం శుభ ముహూర్తాలు వచ్చేశాయ్‌! ఆ ఇళ్లలో ఇక పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముహూర్తాల కోసం వెళితే.. శుభ శ్రావణమాసం.. శుభస్య శ్రీఘ్రం అంటూ పంతులు గారు మంచిరోజు నిర్ణయించేస్తారు! ఈ నెల.. అంటే ఆగస్టు 7 నుంచి 28వ తేదీ వరకు పెళ్లి ముహూర్తాలున్నాయి. పైగా మూడునెలల తర్వాత వచ్చిన శుభ ఘడియలు! ఇవి తప్పిపోతే.. మళ్లీ ఆగస్టు 29 నుంచి మూఢాలు ఉండటంతో అక్టోబరు 13 దాకా ముహూర్తాలే లేవు.


దీంతో 7-28 తేదీల మధ్య తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగునున్నాయి. ఆగస్టు 7న శుభ ముహుర్తాలు మొదలవనుండగా.. పెళ్లిళ్లు మాత్రం 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28వ తేదీల్లో జరగనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 26న ఛైత్రమాసంతో పాటు శుక్ర, గురు మూఢాలు మొదలయ్యాయి. తర్వాత వైశాఖ, జేష్ట్య, ఆషాడ (మే, జూన్‌, జూలై)మాసాలు కావడంతో ముహుర్తాలు లేవు. అంటే.. ఈ ఏడాది ఏప్రిల్‌ 26 నుంచి వివాహాలకు అనువైన ముహార్తాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఫంక్షన్‌ హాళ్లు, డెకరేషన్‌ వ్యాపారాలకు పెద్దగా వ్యాపారం లేకుండా పోయింది.


ఇప్పుడు మళ్లీ పెళ్లి ముహూర్తాలు రావడంతో బంగారం వ్యాపారుల నుంచి మొదలు కేటరింగ్‌, డెకరేషన్‌ దాకా సంబంధిత విభాగాలకు ఆర్థికంగా ఊతం లభించనుంది. ఒకే నెలలో వరుసగా ముహుర్తాలు ఉండటంతో పురోహితులకూ డిమాండ్‌ ఏర్పడింది. మంచి ఫంక్షన్‌ హాళ్లు, డీజేల ఎంపికకూ పెళ్లి కుటుంబాల వారు పోటీపడుతున్నారు. ఇప్పటికే పెళ్లిళ్లు కుదుర్చుకున్న వారంతా ఫంక్షన్‌ హాళ్లు, డెకరేషన్స్‌ బుక్‌ చేసుకున్నారని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కొత్త, కొత్త రకాల వంటలు చేసే నైపుణ్యం ఉన్న వంటవారిని కూడా ముందుగానే బుక్‌ చేసుకుంటున్నారని ఓ వంటమనిషి చెప్పారు.


అయితే అక్టోబరు 13 దాకా ఆగితే అక్కడి నుంచి వచ్చే ఉగాది దాకా పెళ్లి ముహుర్తాలే ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఆగస్టులో దాదాపు 10రోజుల పాటు మంచి ముహుర్తాలున్నా.. వాటిలో 11, 18తేదీల్లో వివాహాలు ఎక్కువగా జరగనున్నాయి. 11వ తేదీ ఆదివారం, స్వాతి నక్షత్రం, సప్తమి రావడంతో ఇది చాలా విశేషమైన రోజుగా పరిగణిస్తారు. 18వ తేదీ కూడా ఆదివారం, శ్రవణ నక్షత్రం, చతుర్ధశితో పాటు పౌర్ణమి రావడంతో విశిష్టమైన రోజుగా పండితులు చెబుతుండడంతో ఈ రోజున ఉండే ముహుర్తానికి కూడా మరింత డిమాండ్‌ ఉంది. అయితే ఈనెల 9న, ఆగస్టు 28న కూడా పెళ్లిళ్లు అధికంగా జరగనున్నాయని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘ సమాఖ్య సభ్యులు తాటికొండ. సీతారామశాస్త్రి తెలిపారు.

Updated Date - Aug 06 , 2024 | 03:57 AM