Share News

Bandi Sanjay: చైనా ఆదేశాలతోనే రాహుల్‌ మౌనం

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:23 AM

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై రాహుల్‌ గాంధీ నోరు విప్పకపోవడానికి ఆయనకు చైనా నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని, చైనా ఆలోచనలను రాహుల్‌ భారత్‌లో అమలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.

Bandi Sanjay: చైనా ఆదేశాలతోనే రాహుల్‌ మౌనం

  • బంగ్లా హిందువులపై దాడుల గురించి

  • అందుకే ఆయన స్పందించట్లేదు

  • దేశాన్ని కులాల పేరుతో విభజించే కుట్ర

  • కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి బండి ఫైర్‌

కరీంనగర్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై రాహుల్‌ గాంధీ నోరు విప్పకపోవడానికి ఆయనకు చైనా నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని, చైనా ఆలోచనలను రాహుల్‌ భారత్‌లో అమలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. సోమవారం బీజేవైఎం ఆధ్వర్యంలో కరీంనగర్‌లో హర్‌ ఘర్‌ తిరంగా యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు ఆ మహనీయుల ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరు పాటు పడాలన్న సంకల్పంతో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.


నెహ్రూ కుటుంబానికి రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆలోచనలను కాంగ్రెస్‌ నేతలు తెరమరుగు చేస్తున్నారని సంజయ్‌ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలన్న డిమాండ్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కుల, మత ప్రాంతాల పేరుతో ప్రజలను చీల్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. నెహ్రూ అనాలోచిత విధానాల వల్ల దేశ విభజన గాయాలు ఇంకా వెంటాడుతున్నాయని చెప్పారు.


ఆర్టికల్‌ 370 పేరుతో కశ్మీర్‌ను దేశంలో అంతర్భాగం కాకుండా కాంగ్రెస్‌ కుట్ర చేస్తే.. ప్రధాని మోదీ ఆ ఆర్టికల్‌ను రద్దు చేసి కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని నిరూపించారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కాంగ్రెస్‌ కోసం కాదని, రాజ్యాంగ ఫలాలు నెహ్రూ కుటుంబం కోసం మాత్రమే కోసమే కాదని, దేశంలో ప్రతీ ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందాలని సంజయ్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - Aug 13 , 2024 | 04:23 AM