Share News

BC Commission: కుల గణనకు మార్గదర్శకాలెప్పుడు?

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:41 AM

రాష్ట్రంలో కొత్త బీసీ కమిషన్‌ ఏర్పాటై దాదాపు నెల రోజులు కావస్తోంది. ఈ కమిషన్‌పై కుల గణన అనే బృహత్తరమైన బాధ్యత ఉంది. దానిని సవాలుగా తీసుకొని పని చేయడానికి కమిషన్‌ కూడా సిద్ధంగా ఉంది.

BC Commission: కుల గణనకు మార్గదర్శకాలెప్పుడు?

  • స్పష్టత కోసం బీసీ కమిషన్‌ ఎదురుచూపులు

  • బీసీ గణనా? సమగ్ర కులాల గణనా?

  • ప్రకటనలతోనే సరిపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

  • బీసీ సంఘాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి

  • కుల గణన కోసమే స్థానిక ఎన్నికల వాయిదా

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త బీసీ కమిషన్‌ ఏర్పాటై దాదాపు నెల రోజులు కావస్తోంది. ఈ కమిషన్‌పై కుల గణన అనే బృహత్తరమైన బాధ్యత ఉంది. దానిని సవాలుగా తీసుకొని పని చేయడానికి కమిషన్‌ కూడా సిద్ధంగా ఉంది. కానీ, కుల గణన చేపట్టేందుకు బీసీ కమిషన్‌కు ప్రభుత్వం ఇప్పటికీ మార్గదర్శకాలు (టీవోఆర్‌) ఇవ్వలేదు. దీంతో ఏం పని చేయాలో తోచని స్థితిలో కమిషన్‌ ఉంది. కమిషన్‌ను ఎందుకు నియమించారో, అది ఎలాంటి విధులు నిర్వహించాలో చెప్పేదే టీవోఆర్‌. కాగా, బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ సెప్టెంబరు 6న ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. టీవోఆర్‌ను విడిగా విడుదల చేస్తామని పేర్కొంది. కానీ, నెల రోజులు గడుస్తున్నా విడుదల చేయడంలేదు.


వాస్తవానికి కుల గణన కోసమే బీసీ కమిషన్‌ ఏర్పాటయిందని, దాని తక్షణ కర్తవ్యం కూడా అదేననే రీతిలో అభిప్రాయం జనంలోకి వెళ్లింది. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు పదే పదే అదే విషయం చెబుతున్నారు. బీసీ గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అంటున్నారు. సెప్టెంబరు 9న బీసీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యులు బాధ్యతలు స్వీకరించిన సమయంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల గణనకు కట్టుబడి ఉందని, ఆ ప్రక్రియ పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి కూడా పలు సందర్భాల్లో ఇదే విషయం చెబుతూ వస్తున్నారు. కానీ, ఆచరణలోకి మాత్రం రావడంలేదు. దీంతో కుల గణన వెంటనే చెపట్టాలని, ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ ఇచ్చినట్లుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. జాప్యం చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాయి.


  • ప్రభుత్వంపై బీసీ సంఘాల ఒత్తిడి..

కుల గణ కోసం బీసీ సంక్షేమ సంఘం ఇటీవల ‘చలో హైదరాబాద్‌’కు పిలుపునిచ్చింది. పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. ఆ సంఘం నాయకులతో మాట్లాడి కార్యక్రమాన్ని వాయిదా వేయించారు. కుల గణన తక్షణం చేపడతామని, మార్గదర్శకాలు రెండు మూడు రోజుల్లో వస్తాయని ప్రకటించారు. అయినా కార్యరూపం దాల్చలేదు. దీంతో రెండు రోజుల క్రితం బీసీ సంఘాలు, మేధావులు సదస్సు నిర్వహించి.. మార్గదర్శకాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయని నిలదీశారు. మరోవైపు కొత్త బీసీ కమిషన్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే.. పాత కమిషన్‌ చైర్మన్‌ను, సభ్యులను పిలిపించుకొని వారు చేపట్టిన పనులపై ఆరా తీసింది. కుల గణనపై ఎలాంటి కసరత్తు చేశారో వివరాలు తెలుసుకుంది. తర్వాత మరో రెండు రోజులకే పంచాయతీరాజ్‌ విభాగం అధికారులతో సమావేశమై.. కుల గణనకు అవసరమయ్యే యంత్రాంగం, ప్రక్రియపై చర్చించింది.


అనంతరం.. కుల గుణన విధివిధానాలపై చర్చించామని, త్వరలో జిల్లాల వారీగా క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్తామని ప్రకటించింది. రెండు మూడు రోజుల్లో షెడ్యూల్‌ ప్రకటిస్తామని తెలిపింది. అయితే వారం రోజులవుతున్నా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. బీసీ కమిషన్‌ ఎలాంటి విధులు నిర్వహించాలో, దాని ఎజెండా ఏమిటో, ప్రాధాన్యం క్రమం ఎలాంటిదో తెలుపుతూ ప్రభుత్వం తప్పనిసరిగా టీవోఆర్‌ విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీసీ కమిషన్‌కు కులగణనే ప్రధాన కర్తవ్యంగా ప్రభుత్వం బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. కేవలం బీసీల కుల గణన మాత్రమే చేయాలా? అన్ని కులాల సమగ్ర గణన చేయాలా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఓటరు జాబితా ఆధారంగా బీసీ కులాల లెక్కలు తీయాలా? లేక ఇంటింటి సర్వేకు వెళ్లాలా? అన్నది కూడా మార్గదర్శకాల ద్వారానే స్పష్టత వస్తుంది. ఏ రకమైన కులగణన చేపడితే న్యాయపరమైన చిక్కులు ఉండవో ప్రభుత్వం అధ్యయనం చేసి మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా బీసీ కమిషన్‌ తన పని పరిధిని, పరిమితులను నిర్వచించుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.


  • కుల గణన కోసమే ఎన్నికల వాయిదా..

గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 1తో గడువు ముగిసింది. ప్రభుత్వం స్పెషల్‌ ఆఫీసర్లను నియమించి పాలన సాగిస్తోంది. ఎన్నికల సమయంలో బీసీ గణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో.. దానిని అమలుపరచాలనే ఉద్దేశంతో కూడా ఎన్నికలను వాయిదా వేసింది. అయితే కేంద్ర నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండడం తో వీలైనంత త్వరగా గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ గణన చేసేందుకు.. గడువు ముగిసిన పాత కమిషన్‌ స్థానంలో కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేసింది.


ఈ కమిషన్‌ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంది. పంచాయతీరాజ్‌ ఉద్యోగులు, ఇతర శాఖల సిబ్బంది సహకారంతో ప్రభుత్వం ఆశించిన గడువులోపు కుల గణన ప్రక్రియ పూర్తవుతుందనే విశ్వాసంతో బీసీ కమిషన్‌ ఉంది. దసరా సెలవులు (అక్టోబరు రెండో వారం) ఇందుకు కలిసివస్తాయని, జనాభా లెక్కల్లో వివరాలు సేకరించడం లో అనుభవం ఉన్న టీచర్లను కూడా వినియోగించుకోవచ్చునని భావిస్తోంది. వివరాల సేకరణ తర్వాత వాటి నిర్ధారణకు క్షేత్రస్థాయి పరిశీలన, వివరాల విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత రిజర్వేషన్లు ఎంతమేరకు ఇవ్వవచ్చో కమిషన్‌ సూచిస్తుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.

Updated Date - Oct 01 , 2024 | 04:41 AM