BC Welfare: కులగణన పూర్తయ్యే వరకు బీసీలూ.. అప్రమత్తం
ABN , Publish Date - Oct 21 , 2024 | 05:03 AM
రాష్ట్రంలో కులగణన పూర్తయ్యే వరకు బీసీలంతా అప్రమత్తంగా ఉండాలని పలు పార్టీల నేతలు, బీసీ నేతలు అన్నారు.
రౌండ్‌టేబుల్ సమావేశంలో అఖిలపక్ష, బీసీ నేతలు
బీసీలు రాజకీయ అధికారం సాధించుకునేందుకు కులగణన ఏకైక పరిష్కారం : వీహెచ్
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కులగణన పూర్తయ్యే వరకు బీసీలంతా అప్రమత్తంగా ఉండాలని పలు పార్టీల నేతలు, బీసీ నేతలు అన్నారు. తెలంగాణలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచాలని చేస్తున్న పోరాటం విజయవంతమైందని పేర్కొన్నారు. సమష్టి పోరాటం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో18 విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ‘‘సమగ్ర కులగణనకు మద్దతుగా అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం’’ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందని, ఇప్పటికే కులగణన ప్రక్రియ ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో అధిక శాతమున్న బీసీలు రాజకీయ అధికారం సాధించుకోవడానికి కులగణన ఏకైక పరిష్కారమార్గమన్నారు.
శాసనమండలిలో విపక్షనేత మధుసూదనాచారి మాట్లాడుతూ కులగణన పూర్తయ్యే వరకు బీసీ సమాజం నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ.. జనాభా లెక్కల తర హాలో కాకుండా స్పష్టంగా కులగణన జరగాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కులగణనపై బీసీ నేతలు చేస్తున్న న్యాయపోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
మాజీమంత్రి శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ కులగణన త ర్వాతే రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని, ప్రభుత్వం ఏసాకులు చూపకుండా కులగణనను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో సమగ్ర కులగణన చేపట్టాలని గత ఆరు నెలలుగా ప్రజాస్వామ్యబద్ధంగా బీసీలు చేసిన పోరాటమే ఈ విజయమన్నారు. ప్రభుత్వం జీవో 18 విడుదల చేయడంతో రాష్ట్రంలో కులగణన ప్రక్రియ ప్రారంభమైందన్నారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.