Share News

Etela Rajendar : హైడ్రా పేరిట హైడ్రామా

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:49 AM

రాష్ట్రంలో హైడ్రా పేరిట హైడ్రామా నడుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. కూల్చివేతల పేరుతో జరుగుతున్నదంతా డ్రామా తప్ప.. సమాజహితం కోసం కాదని అన్నారు.

Etela Rajendar : హైడ్రా పేరిట హైడ్రామా

  • పేదల జోలికొస్తే ఖబడ్దార్‌.. సీఎం రేవంత్‌కు ఈటల హెచ్చరిక

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హైడ్రా పేరిట హైడ్రామా నడుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. కూల్చివేతల పేరుతో జరుగుతున్నదంతా డ్రామా తప్ప.. సమాజహితం కోసం కాదని అన్నారు. ఈ రాష్ట్రమేదో కొత్తగా ఏర్పడినట్లు, తానే మొదటి సీఎం అన్నట్లు రేవంత్‌ పోజులు కొడుతున్నారని విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. పేదల కాలనీలకు హైడ్రా నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక ప్రభుత్వం పోతే మరో ప్రభుత్వం వస్తుందన్న సోయి లేదా..? అని సీఎంను నిలదీశారు. పట్టాలు పొందిన పేదల ఇళ్లు కూల్చివేస్తున్నందుకుగాను.. గడచిన ఏడు దశాబ్దాలుగా పనిచేసిన ముఖ్యమంత్రులంతా తప్పు చేశారని చెంపలు వేసుకోవాలని రేవంత్‌ను డిమాండ్‌ చేశారు. ఏడు దశాబ్దాల్లో జరిగిన అక్రమాలు ఒక్క రోజులో ఎలా పోతాయని సీఎంను నిలదీశారు. పేదల ఇళ్లను కూలిస్తే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. ప్రజలు తిరగబడితే ఏమవుతుందో బంగ్లాదేశ్‌, శ్రీలంకలను చూసి నేర్చుకోవాలన్నారు.


  • ఈటలకు అవగాహన లేదు: టీపీసీసీ

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలపై అవగాహన లేని ఈటల రాజేందర్‌ హైడ్రాపై విమర్శలు మానుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్‌గౌడ్‌ సూచించారు. ఆయన కబ్జాకోరులకు అండగా ఉంటారా.. లేక హైదరాబాద్‌ నగరవాసులకా అన్నది తేల్చుకోవాలన్నారు. హైడ్రా చర్యలతో రేవంత్‌కు ప్రశంసలు దక్కుతుంటే.. ఈటలకు కళ్లు మండుతున్నాయని ఓ ప్రకటనలో విరుచుకుపడ్డారు. ఆక్రమణల కూల్చివేతలను రాజకీయ కోణంలో కాకుండా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణగా చూడాలన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 04:49 AM