Share News

CM Revanth : 17 నుంచి ప్రజాపాలన

ABN , Publish Date - Aug 28 , 2024 | 03:36 AM

రాష్ట్రంలో సెప్టెంబరు 17 నుంచి పది రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడతామని సీఎం చెప్పారు.

CM Revanth : 17 నుంచి ప్రజాపాలన

  • రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులే ఎజెండా

  • పది రోజులపాటు దరఖాస్తుల స్వీకరణ

  • హెల్త్‌కార్డుల ద్వారానే ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌

  • అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌ వెల్లడి

  • సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  • రాష్ట్రవ్యాప్తంగా నివారణ చర్యలు చేపట్టండి

  • ఉదాసీనంగా వ్యవహరించే వారిపై సస్పెన్షన్‌

  • గోషామహల్‌లో ఉస్మానియా నూతన ఆస్పత్రి

  • 32 ఎకరాల్లో కార్పొరేట్‌ ఆస్పత్రుల తరహాలో!

  • 50 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకొని డిజైన్లు

  • ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి భవనాన్నీ పరిరక్షిద్దాం

  • ఏడాదిలో 15 కొత్త నర్సింగ్‌ కాలేజీ భవనాలు

  • ఇరవై రెండు జిల్లాల్లో మహిళా సంఘాలకూ..

  • ‘స్పీడ్‌’ పనులపై సమీక్షలో సీఎం నిర్ణయాలు

హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సెప్టెంబరు 17 నుంచి పది రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడతామని సీఎం చెప్పారు. ఇకపై రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులకు లింక్‌ ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రజాపాలనలో ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను ేసకరిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డుల్లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మంగళవారం సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. హెల్త్‌ డిజిటల్‌ కార్డుల జారీకి ఎలాంటి పద్ధతి అనుసరించాలి? ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ నమోదు చేసేందుకు ఏయే వైద్య పరీక్షలు చేయాలి? వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలా? రాష్ట్రంలో ఉన్న లేబొరేటరీల సాయం తీసుకోవాలా? తదితర అంశాలపై పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసే హెల్త్‌ కార్డు ప్రామాణికంగా ఉంటుందన్నారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. డెంగీ, చికెన్‌ గున్యా, వైరల్‌ జ్వరాలతో వివిధ ఆస్పత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాదులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్‌, స్ర్పే పనులు ముమ్మరం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించారు.

పనిచేయని ఉద్యోగులను, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్‌ చేయాలని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్‌.. సమన్వయంతో పని చేయాలన్నారు. అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకోవాలన్నారు.


గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం..

ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాన్ని గోషామహల్‌లో నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అక్కడ పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉన్న 32 ఎకరాల స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యంగా ఎంచుకున్న ‘స్పీడ్‌’ (స్మార్ట్‌ ప్రోయాక్టివ్‌ ఎఫిషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ) ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై సీఎం మంగళవారం సచివాలయంలో తొలి సమీక్ష నిర్వహించారు.

స్పీడ్‌ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్‌ కాలేజీలు, 28 కొత్త పారా మెడికల్‌ కాలేజీలు, జిల్లాల్లో మహిళా సంఘాలకు సమాఖ్య భవన నిర్మాణ అంశాలపై చర్చించారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని రాబోయే 50ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌ చేయాలన్నారు. ఆస్పత్రిలో అన్ని విభాగాలతోపాటు, అకడమిక్‌ బ్లాక్‌, నర్సింగ్‌ ఉద్యోగులకు హాస్టళ్లు నిర్మించాలన్నారు.

కార్పొరేట్‌ ఆస్పత్రుల తరహాలో అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దాలన్నారు. పేషంట్లకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా విశాలమైన ప్రాంగణాలు, తగిన ఖాళీ ప్రదేశం ఉండేలా డిజైన్‌ రూపొందించాలని చెప్పారు. ఇందుకోసం అనుభవజ్ఞులైన ఆర్కిటెక్టుల సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఉస్మాని యా ఆస్పత్రి భవనాన్ని సంరక్షిస్తామని, దానిని చారిత్రక కట్టడంగా భావించి పునరుద్ధరిస్తామని సీఎం చెప్పా రు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ పనులు చేపడతామని, ఆ ప్రాంగణాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తామన్నారు.

గోషామహల్‌లోని పోలీస్‌ స్టేడియం, పోలీస్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సులకు సం బంధించిన 32 ఎకరాలు తీసుకుంటున్నందుకుగాను ఆ శాఖకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ఆదేశించారు. దీనికోసం పేట్లబురుజులోని పోలీస్‌ ట్రా న్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌, సిటీ పోలీస్‌ అకాడ మీ చుట్టూ ఉన్న స్థలాన్ని పరిశీలించాలని సూచించారు. ఇక రాష్ట్రంలో కొత్తగా నిర్మించే ఆస్పత్రుల పనుల ను వేగవంతం చేయాలని, 15 నర్సింగ్‌ కాలేజీల భవనాలను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది నుంచే నర్సింగ్‌ కాలేజీలను ప్రారంభించాలని, తాత్కాలికంగా అద్దె భవనాల్లో నిర్వహించే ఏర్పాట్లు చూడాలని చెప్పారు.


22 సమాఖ్య భవనాలు..

మహిళా స్వయం సహాయక సంఘాలకు పది జిల్లాల్లో సమాఖ్య భవనాలున్నాయని, మిగతా 22 జిల్లాల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్‌ నిర్ణయించారు. ఒక్కో భవనానికి ఎకరం స్థలం కేటాయించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. స్థలాలను వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌లోని శిల్పారామం పక్కన మహిళా శక్తి సంఘాలకు కేటాయించిన మూడెకరాల స్థలాన్ని వెంటనే ఆ విభాగానికి బదిలీ చేయాలని ఆదేశించారు. మహిళా శక్తి సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను ఏడాది పొడవునా విక్రయించుకునేందుకు స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచ స్థాయి అతిథులు, ప్రముఖులు, జాతీయ నేతలు ఎవరు వచ్చినా ఈ సెంటర్‌ను తప్పక సందర్శించేలా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రానికే ఇది తలమానికమైన పర్యాటక ప్రాంతంగా మారాలని సీఎం రేవంత్‌ ఆకాంక్షించారు.

Updated Date - Aug 28 , 2024 | 03:36 AM