Share News

CM Revanth Reddy: పెట్టుబడులకు కొరియా సిద్ధం..

ABN , Publish Date - Aug 13 , 2024 | 03:01 AM

అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో విజయవంతమైన సీఎం రేవంత్‌రెడ్డి.. దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగిస్తున్నారు.

CM Revanth Reddy: పెట్టుబడులకు కొరియా సిద్ధం..

  • టెక్స్‌టైల్‌ ఫెడరేషన్‌ సానుకూలత ఆ దేశ పారిశ్రామికవేత్తలతో

  • సీఎం రేవంత్‌ సమావేశంతెలంగాణలో హ్యుందయ్‌

  • మెగా టెస్టింగ్‌ సెంటర్‌ విద్యుత్తు, గ్యాస్‌, బ్యాటరీల

  • తయారీలో ఎల్‌ఎస్‌ కార్పొరేషన్‌.. అంతర్జాతీయ స్థాయిలో

  • మౌలిక వసతులు సమకూర్చాం

  • అన్నివిధాలా సహకరిస్తాం మా రాష్ట్రానికి రండి

  • ప్రతినిధులతో సమావేశాల్లో ముఖ్యమంత్రి పిలుపు

హైదరాబాద్‌/వరంగల్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో విజయవంతమైన సీఎం రేవంత్‌రెడ్డి.. దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించినా.. పరిశ్రమలు రాని వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులను సాధించగలిగారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను అక్కడ జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం వివరించారు. దీంతో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని కొరియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు.


అమెరికా పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు బృందం శనివారం కొరియాకు చేరుకున్నారు. అక్కడ పలు కంపెనీలు, వివిధ వ్యాపార, వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కొరియా టెక్స్‌టైల్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కియాక్‌ సంగ్‌, వైస్‌చైర్మన్‌ సొయాంగ్‌ జూ సహా 25 అగ్ర శ్రేణి టెక్స్‌టైల్‌ కంపెనీల అధినేతలు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ రంగ విస్తృతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ.. స్థానిక కంపెనీలతోపాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కు సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని వివరించారు. బయటి దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతును వేగంగా పూర్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు.


  • హ్యుందయ్‌ మెగా టెస్టింగ్‌ సెంటర్‌..

మెగా టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చిన హ్యుందయ్‌ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమోటివ్‌ కంపెనీ హ్యుందయ్‌.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. భారత్‌లోని హ్యుందయ్‌ మోటార్‌ ఇండియా ఇంజనీరింగ్‌ (హెచ్‌ఎంఐఈ) ద్వారా ఒక మెగా టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి బృందానికి తెలిపారు. సియోల్‌లో సోమవారం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల నుంచి తమ ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తోందని తెలిపారు. దీనికి అనుగుణంగానే తాము అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులను సమకూర్చామని, పరిశ్రమల పెట్టుబడులకు అనుకూలమైన పాలసీలు రూపొందించామని చెప్పారు. అనుమతుల విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు.


తెలంగాణ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కార్‌ టెస్టింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు హ్యుందయ్‌ కంపెనీ ముందకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సెంటర్‌ ఏర్పాటు వల్ల చుట్టుపక్కల ఇతర చిన్న కంపెనీలు, చిన్న తరహా పరిశ్రమలు విస్తరించే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు సమకూరుతాయన్నారు. అంతేకాకుండా దక్షిణాసియా పసిఫిక్‌ ప్రాంతంలో పలువురికి ఉపాధి లభిస్తుందన్నారు. కాగా, తమ కంపెనీ పెట్టుబడులను విస్తరించేందుకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్‌కు హ్యుందయ్‌ కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌ తమకు ఎంతో కీలకమైన మార్కెట్‌ అని చెప్పారు.


తెలంగాణ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న చొరవ ఎంతో ప్రగతిశీలంగా ఉందని, రాష్ట్రాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వారు అన్నారు. విద్యుత్తు, గ్యాస్‌, బ్యాటరీల రంగంలో ఎల్‌ఎస్‌ పెట్టుబడులు..కొరియాలో అతిపెద్ద పరిశ్రమల గ్రూపు ఎల్‌ఎస్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు సీఎం రేవంత్‌ ఎక్స్‌లో వెల్లడించారు. కార్పొరేషన్‌ చైర్మన్‌ కు జా ఉన్‌తో జరిగిన చర్చల్లో.. తెలంగాణలో ఎలక్ట్రిక్‌ కేబుళ్లు, గ్యాస్‌, విద్యుత్తు, బ్యాటరీల రంగంలో తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. తన ఆహ్వానం మేరకు ఎల్‌ఎస్‌ కార్పొరేషన్‌ బృందం త్వరలో రాష్ట్ర పర్యటనకు వచ్చేందుకు అంగీకారం తెలిపారని వెల్లడించారు.


  • యువత రాణించేలా కార్యాచరణ: సీఎం రేవంత్‌రెడ్డి

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని యువతకు ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. యువత సన్మార్గంలో పయనించాలని ఆకాంక్షించారు. తెలంగాణ యువత రాణించేలా ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో కార్యాచరణ రూపొందించిందని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ, స్కిల్‌ వర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం, క్రీడల పట్ల ఆసక్తి పెంచడం తదితర నిర్ణయాలు అందులో భాగమని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.


  • వస్త్ర నగరికి కలిసి వచ్చేనా..?

వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీలో 2017లో అప్పటి ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రూ.1,350 కోట్ల వ్యయంతో 1,150 ఎకరాల్లో 200కు పైగా వస్త్ర కంపెనీలు, లక్ష మందికి ప్రత్యక్షంగా, మరో నాలుగు లక్షల మందికి పరోక్షంగా కేఎంటీపీ ద్వారా ఉపాది కల్పించబోతున్నట్లు చెప్పింది. ఈ మేరకు 22 కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నప్పటికీ ఏడేళ్లలో కేవలం మూడు కంపెనీలు మాత్రమే ఇక్కడ అడుగుపెట్టాయి. ఇందులో దక్షిణ కొరియాకు చెందిన యంగాన్‌ కంపెనీ 8 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.


2023లో గత ప్రభుత్వంతో యంగాన్‌ కంపెనీ ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో జూన్‌ 29న వరంగల్‌ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును సందర్శించారు. పరిశ్రమలు రాకపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో టెక్స్‌టైల్‌ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే దక్షిణ కొరియాపై ఫోకస్‌ పెట్టిన సీఎం.. తన పర్యటనలో భాగంగా ఆ దేశాన్ని సందర్శించారు. ఇప్పటికే కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కులో పెట్టుబడులు పెట్టిన యంగాన్‌ కంపెనీ, కొరియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ర్టీతో పాటు మరో 25అగ్రశ్రేణి కంపెనీలతో సమావేశాన్ని నిర్వహించి పెట్టుబడులను ఆహ్వానించడంతో వరంగల్‌లో వస్త్రనగరి భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి.

Updated Date - Aug 13 , 2024 | 03:01 AM