Share News

Nizamabad: తెలంగాణ ఏర్పాటులో డీఎస్‌ పాత్ర కీలకం..

ABN , Publish Date - Jul 01 , 2024 | 04:22 AM

కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేత డీఎస్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన సామాన్య కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు ఎదిగారని, కష్టపడి పని చేశారని చెప్పారు. ధర్మపురి శ్రీనివాస్‌ మరణంతో కాంగ్రెస్‌ పార్టీ ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయినట్లందన్నారు.

Nizamabad: తెలంగాణ ఏర్పాటులో డీఎస్‌ పాత్ర కీలకం..

  • గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు

  • నిజామాబాద్‌లో నివాళులర్పించిన సీఎం రేవంత్‌

  • అధికార లాంఛనాలతో డీఎస్‌ అంత్యక్రియలు

  • నిబద్ధత గల నాయకుడిని కోల్పోయాం.. గాంధీ కుటుంబానికి ఆత్మీయుడిగా గుర్తింపు పొందారు: సీఎం రేవంత్‌

  • జన హృదయ నేతకు అశ్రునయనాలతో అంత్యక్రియలు

నిజామాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేత డీఎస్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన సామాన్య కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు ఎదిగారని, కష్టపడి పని చేశారని చెప్పారు. ధర్మపురి శ్రీనివాస్‌ మరణంతో కాంగ్రెస్‌ పార్టీ ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయినట్లందన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌లో డీఎస్‌ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన కుమారులైన సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌, కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో డీఎస్‌ పాత్ర ఎనలేనిదన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2004లోనే తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతపై సోనియాగాంధీకి చెప్పారని గుర్తుచేశారు.

19.jpg


ఆయన వివరించడం వల్లే సోనియా కరీంనగర్‌ సభలో తెలంగాణపై మాట్లాడారన్నారు. ఆ తర్వాత రాష్ట్ర కల సాకారమైందని రేవంత్‌ తెలిపారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీకి దూరమైన ఆయన్ను పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఎదురైనప్పుడు సోనియాగాంధీ ఆత్మీయంగా పలకరించారన్నారు. పార్టీలో లేకపోయినా డీఎస్‌ మనవాడని సోనియా చెప్పారని పేర్కొన్నారు. ఆ సమయంలోనే కాంగ్రె్‌సలో మళ్లీ చేరతానని డీఎస్‌ అన్నారని.. రాజ్యసభ పదవీ కాలం పూర్తవకుండానే పార్టీలో చేరతానడడంతో ఏవైనా పదవులను ఆశిస్తున్నారా? అని అడిగితే.. తనకు పదవుల మీద వ్యామోహం లేదని డీఎస్‌ చెప్పారని రేవంత్‌ గుర్తుచేసుకున్నారు.


తాను చనిపోయినప్పుడు కాంగ్రెస్‌ జెండా కప్పాలని ఆయన కోరారన్నారు. ఆయన కోరికను నెరవేర్చి, అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. 40 ఏళ్ల పాటు పార్టీకి చేసిన సేవలను గుర్తించి నివాళులర్పించామన్నారు. డీఎస్‌ మరణ వార్త తెలియగానే పార్టీ అగ్రనేత సోనియా, రాహుల్‌ తమ సంతాపాన్ని తెలియజేశారని చెప్పారు. డీఎస్‌ జ్ఞాపకార్థం ప్రభుత్వం తరఫున ఏం చేయాలనేదానిపై కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. డీఎస్‌ కుటుంబానికి అండగా ఉంటామని రేవంత్‌ తెలిపారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్‌, జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


డీఎస్‌ మృతి పట్ల కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సంతాపం వ్యక్తం చేశారు. కాగా, ఉద్యోగులకు డి.శ్రీనివాస్‌ ఇచ్చిన మద్దతును ఎన్నడూ మరచిపోలేమని ఏపీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. జన హృదయ నేత డి.శ్రీనివా్‌సకు ప్రజలు అశ్రునయనాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. డీఎస్‌ అంతిమయాత్ర నిజామాబాద్‌లోని ఆయన నివాసం నుంచి బైపాస్‌ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వరకు సాగింది. అంతిమయాత్రలో డీఎస్‌ అభిమానులు, శ్రేయోభిలాషులు,ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చితికి పెద్ద కుమారుడు సంజయ్‌ నిప్పంటించారు.

Updated Date - Jul 01 , 2024 | 04:22 AM