Share News

Kaleshwaram Project: కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు తాఖీదులు

ABN , Publish Date - Aug 06 , 2024 | 02:25 AM

కాళేశ్వరం ప్రాజెక్టుల వైఫల్యంపై భూపాలపల్లి జిల్లా కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజీలో జరిగిన నష్టంపై ప్రైవేటు పిటిషన్‌ను విచారించిన భూపాలపల్లి ప్రిన్సిపల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు తాఖీదులు జారీ చేసింది.

Kaleshwaram Project: కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు తాఖీదులు

  • మేడిగడ్డ వైఫల్యంపై ప్రైవేటు పిటిషన్‌ దాఖలు

  • సెప్టెంబరు 5న హాజరు కావాలంటూ

  • కేసీఆర్‌, హరీశ్‌రావులకు కోర్టు ఆదేశం

భూపాలపల్లి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుల వైఫల్యంపై భూపాలపల్లి జిల్లా కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజీలో జరిగిన నష్టంపై ప్రైవేటు పిటిషన్‌ను విచారించిన భూపాలపల్లి ప్రిన్సిపల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు తాఖీదులు జారీ చేసింది. వీరితో పాటు మరో ఆరుగురు కూడా సెప్టెంబరు 5న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలిచ్చింది. ఈ నోటీసులను జిల్లా కోర్టు గత నెల 30న రిజిస్టర్‌ పోస్టు ద్వారా వారికి పంపింది. రూ.లక్ష కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 10వ బ్లాకులోని పిల్లర్లు కుంగిపోయి పనికిరాకుండా పోవడానికి ప్రధానంగా ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలు, పదేపదే డిజైన్లలో మార్పులు, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం లాంటి అంశాలే కారణమని.. ఇందుకు బాధ్యులను గుర్తించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి 2023 అక్టోబరు 25న భూపాలపల్లి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.


బాధ్యులను గుర్తించాక వారిని విచారించాలని కోరుతూ జిల్లా అదనపు ప్రిన్సిపల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో అప్పటి సీఎం కేసీఆర్‌, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, అధికారులు, ప్రాజెక్టు నిర్మాణ సంస్థలను కూడా విచారించాలని కోరగా అప్పట్లో ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనిని రాజలింగమూర్తి హైకోర్టులో సవాలు చేశారు. జిల్లా కోర్టులోనే రివిజన్‌ పిటిషన్‌ను దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు సూచించడంతో తిరిగి పిటిషన్‌ వేశారు. దీనిని స్వీకరించిన కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాన కారకులని, రూ.లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యాలు నెరవేరకుండా పోయాయని, బ్యారేజీ నిర్మాణం సందర్భంగా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగిందని, నాసిరకం పనులతో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించలేదని కేంద్ర విచారణ సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు పిటిషనర్‌ చెబుతున్నారు.


ఇందుకు బాధ్యులైన కేసీఆర్‌తో పాటు హరీశ్‌ రావు, నాటి నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, అప్పటి చీఫ్‌ ఇంజనీర్లు హరీరామ్‌, శ్రీధర్‌, నిర్మాణ సంస్థల బాధ్యులు ఎల్‌అండ్‌టీ సంస్థకు చెందిన జనరల్‌ మేనేజర్‌ సురేశ్‌కుమార్‌, మెగా సంస్థకు చెందిన యజమాని కృష్ణారెడ్డిని విచారించాలంటూ పిటిషనర్‌ కోరగా.. సెప్టెంబరు 5న వీరంతా హాజరు కావాలంటూ కోర్టు నోటీసులు జారీ చేసింది.

Updated Date - Aug 06 , 2024 | 02:25 AM