Share News

Cm Revanth : రాజకీయ నిఘా కంటే.. నేరాల నియంత్రణకే ప్రాధాన్యమివ్వాలి

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:01 AM

రాజకీయ వ్యవస్థపై నిఘా తగ్గించి నేరాల నియంత్రణపై నిఘా పెంచాలని పోలీసు అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా వచ్చామని,

Cm Revanth : రాజకీయ నిఘా కంటే.. నేరాల నియంత్రణకే ప్రాధాన్యమివ్వాలి

  • నేతలకు అవసరానికి మించిన భద్రత వద్దు

  • సైనిక్‌ స్కూల్‌ తరహాలో

  • ప్రత్యేక స్కూల్‌: సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాజకీయ వ్యవస్థపై నిఘా తగ్గించి నేరాల నియంత్రణపై నిఘా పెంచాలని పోలీసు అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా వచ్చామని, తమకు మితిమీరిన భద్రత అవసరం లేదని, ఎవరికి ఎంత అవసరమో అంతే భద్రత కల్పించాలన్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్‌.. ఆపైస్థాయి అధికారులతో బంజారహిల్స్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో సైన్యం మాదిరిగా రాష్ట్రంలోకి డ్రగ్స్‌ రాకుండా పోలీసు పహారా ఉండాలన్నారు. పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణలో పదేళ్లలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైనిక్‌ స్కూళ్ల తరహాలో రాష్ట్రంలో పోలీసుల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తానూ పోలీసు కుటుంబం నుంచే వచ్చానని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. తన అన్న భూపాల్‌ రెడ్డి వనపర్తిలో కానిస్టేబుల్‌గా పనిచేసి తనను చదివించారని, తన అన్న పెంపకంతోనే తాను ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చానని చెప్పారు. తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు.

పైసలతో పోస్టింగ్‌లు తెచ్చుకోవద్దు

పైసలు ఖర్చు చేసి పోస్టింగ్‌లోకి వస్తే.. వారిపై ఏసీబీ నిఘా పెడుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. సామర్థ్యం, పనితీరుతోనే పోలీసు సిబ్బంది బదిలీలు కోరుకోవాలన్నారు. సామర్థ్యం ఉన్నవారిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పారు. అందుకు సందీప్‌ శాండిల్య ఉదాహరణ అని పేర్కొన్నారు.

Updated Date - Jul 03 , 2024 | 09:42 AM